బహిరంగ చర్చకు సిద్ధం
సాక్షి, గుంటూరు :గుంటూరు మిర్చియార్డు అగ్నిప్రమాదానికి గురైనపుడు రైతులకు నష్టపరిహారం పంపిణీలో అక్రమాలు జరిగాయనీ, అందులో తన పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణల్ని యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. తాను ప్రజల మధ్య నుంచి రాజకీయాల్లోకి వచ్చాననీ, తండ్రుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని ధ్వజమెత్తారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నరేంద్ర ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా బహిరంగ చర్చకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు.
ఏం ఆధారముందని నరేంద్ర ఆరోపణలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విలువలు పాటించాలన్న విషయాన్ని మర్చిపోకూడదని అప్పిరెడ్డి హితవు పలికారు. 2007 జూన్ నుంచి 2010 జూన్ వరకూ యార్డు చైర్మన్గా తాను వ్యవహరించాననీ, ఆ కాలంలో ఎలాంటి అక్రమాలు జరగలేదనీ, ఫైళ్లు కూడా మాయం కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన బాధిత రైతులకు నేరుగా చెక్కుల పంపిణీ జరగలేదనీ, ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే రెవెన్యూ సిబ్బంది రైతులకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఒకవేళ యార్డులో అధికారులెవ్వరైనా అక్రమాలకు పాల్పడి ఉంటే కచ్చితంగా శిక్షకు గురవుతారన్నారు.
అప్పటి యార్డు పాలకవర్గం తప్పు చేసిందని భావిస్తే ఐదేళ్లుగా అడగని టీడీపీ నాయకులు ఇప్పుడెందుకు ఆరోపణలు సంధిస్తున్నారని అప్పిరెడ్డి ప్రశ్నించారు. తాను చైర్మన్గా ఏ ఒక్కరి వ్యాపారికి కూడాను ఒక్క లై సెన్సు కూడా ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పాలకవర్గం ఎప్పుడూ తప్పు చేయలేదని మనసా, వాచా నమ్ముతున్నామని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2010లోనే తాను తనపైనే విజిలెన్సు విచారణ జరపాలని అధికారుల్ని కోరానన్నారు. ఇది అర్థం చేసుకోలేక కొందరు నాయకులు అర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. దీనివెనుక ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నాయనీ, వాటన్నింటి పైనా మరో సందర్భంలో మాట్లాడతానని అప్పిరెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు.