‘ఓ సాథియా’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ సాథియా
నటీనటులు: ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని తదితరులు
నిర్మాణ సంస్థ: తన్విక–జస్విక క్రియేషన్స్
నిర్మాతలు: సుభాశ్ కట్టా, చందన కట్టా
దర్శకత్వం:దివ్యభావన
సంగీతం: విన్నూ వినోద్
సినిమాటోగ్రఫీ: ఈజే వేణు
విడుదల తేది: జులై 7, 2023
కథేంటంటే
బీటెక్ చదువుతున్న అర్జున్( ఆర్యన్ గౌర), అదే కాలేజీకి చెందిన కీర్తి (మిస్తీ చక్రవర్తి)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అర్జున్ అంటే నచ్చని మరో స్టూడెంట్ కూడా కీర్తిని ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడుతుంటాడు. అతని టార్చర్ నుంచి బయటపడేందుకు అర్జున్‌తో లవ్ ఉన్నట్లు అబద్దం చెబుతుంది. అలా అర్జున్, కీర్తి బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు కిర్తికి ప్రపోజ్ చేద్దామని ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది. అసలు కీర్తి ఎక్కడికి వెళ్లింది? ఆమె కోపం పిచ్చొడిలా మారిన అర్జున్ తిరిగి ఎలా సాధారణ స్థితిలోకి వచ్చాడు? కీర్తి హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి.. ఆమె చదువుకునే కాలేజీలోనే జాయిన్ అయిన అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కీర్తి ప్రేమను పొందడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు అర్జున్ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తున్నారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ప్రతి వ్యక్తికి తొలి ప్రేమ అనేది చాలా స్పెషల్. ఆ మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు.. ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు దర్శకురాలు దివ్య భావన. తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఆసక్తికర సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారు.
దర్శకురాలు ఎంచుకున్న ఈ లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదని చెప్పలేం. కానీ సున్నితమైన ప్రేమ కథను చాలా సున్నితంగా చూపించారు. ఫస్టాఫ్ అంతా కాలేజీ ఎపిసోడ్స్‌లో రొటీన్‌గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. ఇక . ఇక సెండాఫ్లో కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరి 15 నిమిషాలు అయితే హృదయాలను హత్తుకుంటాయి. అర్జున్, కీర్తిల లవ్స్టోరీలోని ట్విస్ట్ తెలిశాక.. అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లు ఉండడం ఈ సినిమాకు మైనస్.
ఎవరెలా చేశారంటే..
ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేసే యువుడు అర్జున్‌గా ఆర్యన్ గౌర చక్కగా నటించాడు. కొత్తవాడే అయినా ఎక్కడ తడబడలేదు. అయితే అతని డబ్బింగ్ మాత్ర కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇక కీర్తిగా మిస్తీ చక్రవర్తి తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. చైతన్య గరికపాటి కామెడీ బాగా వర్కౌట్ అయింది. దేవీ ప్రసాద్, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ,, క్రేజి ఖన్నా, బుల్లెట్ భాస్కర్, అంబరీష్ అప్పాజి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. విన్నూ వినోద్ సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా, హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. బీజీఎం పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ పనీతీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.