ఉద్యోగిని ఆచూకీ లభ్యం
అదృశ్యమైన ప్రైవేటు ఉద్యోగిని ఆచూకీ లభ్యమైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవే టు సంస్థలో పనిచేస్తున్న శ్రీలత(26) అనే ఉద్యోగిని శుక్రవారం అదృశ్యమవడం విదితమే. దీనిపై శనివారం ఫిర్యాదు అందగా.. 24 గంటల వ్యవధిలో ఆమె ఆచూకీని పేట్‌బషీరాబాద్ పోలీసులు కనుగొన్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి విశాఖపట్నం-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నట్టు గుర్తించారు. దీంతో ఆదివారం ముంబై సమీపంలోని కుర్లా స్టేషన్ వద్ద ఆమెను రైల్వే పోలీసుల సాయంతో రెస్క్యూ చేశారు. ఆమెతో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం శ్రీలత ను హైదరాబాద్ తీసుకువస్తోంది. శ్రీలత ఆచూకీ కనుగొన్నామని, సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపా రు. శ్రీలత ఐటీ ఉద్యోగిని కాదు. ‘మాస్క్ హెయిర్ రీప్లేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్’ సంస్థలో పనిచేస్తున్నారు.
ఘటన పూర్వాపరాలివీ..:
నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీలత(26) తన కుటుంబంతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని సూర్యానగర్ కాలనీలో ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. రోజూ స్కూటీపై రాకపోకలు సాగించే శ్రీలత శుక్రవారం ఉదయం ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికిరాలేదు. అదేరోజు రాత్రి భర్త ఆమె సెల్‌ఫోన్‌కు కాల్ చేయగా.. స్విచ్ఆఫ్ అయి ఉంది. శ్రీలత వినియోగించే వాహనం మేడ్చల్ పోలీసులకు ఈఎంఆర్ఐ వద్ద లభించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. తన భార్య అదృశ్యమైందంటూ శనివారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు మేడ్చల్, పేట్‌బషీరాబాద్, దుండిగల్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన ఉదంతాలను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) అధికారులు కూడా దర్యాప్తులో పాలుపంచుకుని గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం శ్రీలత ఆచూకీ కనుగొనగలిగారు.