అసెంబ్లీ సాక్షిగా.. వరాల కుండపోత
లోక్సభ ఎన్నికల సమయంలో తగిలిన దెబ్బ నుంచి బయటపడటానికి ప్రజా స్వామ్య కూటమి కసరత్తు మొదలుపెట్టింది. ఆ ఎన్నికల్లో మొత్తం 48 లోక్సభ స్థానాలకుగాను కేవలం ఆరు స్థానాల్లోనే ఆ కూటమి విజయాన్ని మూటగట్టు కుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకో వాలని ఇప్పటినుంచే ప్రణాళికలు మొదలుపెట్టంది. ‘మిషన్ అసెంబ్లీ’ పేరిట ఎన్నికలకు సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా అసెంబ్లీ సాక్షిగా ‘ఉచిత’ హామీలు ఇవ్వడానికి సైతం వెనుకాడటం లేదు.
సాక్షి, ముంబై: అధికార పక్షమైన ప్రజాస్వామ్య కూటమి ‘మిషన్ అసెంబ్లీ’ కోసం సిద్ధమవుతోంది. మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునే ప్రకటనలు, నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో అన్నివర్గాల వారిపై వరాల జల్లు కురిపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనేక జనాకర్షక ప్రకటనలు చేస్తోంది.
ముఖ్యంగా రైతుల విద్యుత్ బకాయిల్లో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అసెంబ్లీలో ప్రకటించారు. 2014 మార్చి 31లోపు విద్యుత్ బకాయిల్లో 50 శాతం రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో రైతులు కేవలం 50 శాతం విద్యుత్ బిల్లులే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అదే విధంగా ఈ 50 శాతాన్ని కూడా మూడు విడతల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ముందుగా 2014 ఆగస్టు 31 లోపు కనీసం 20 శాతం, సెప్టెంబర్ 30 లోపు 20 శాతం, అనంతరం 2014 అక్టోబర్ 31 లోపు మిగిలిన 10 శాతం చెల్లించినట్లయితే వారికి మిగిలిన 50 శాతం విద్యుత్ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. దీంతో రైతుల్లో కొంత ఆనందం నెలకొంది. అయితే ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏకంగా రూ. 2,977 కోట్ల అదనపు భారం పడనుంది.
జూలై ఒకటి నుంచి టోల్ బంద్...
రాష్ట్రంలోని 44 టోల్ నాకాలలో టోల్ వసూళ్లను జూలై ఒకటవ తేదీ నుంచి నిలిపివేయనున్నట్టు అజిత్ పవార్ ప్రకటించారు. దీనిపై జూన్ 30 లోపు ఒక ప్రకటనను విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన విడుదల అయిన అనంతరం జూలై ఒకట వ తేదీ నుంచి రాష్ట్రంలోని 44 టోల్ నాకాలలో టోల్ వసూలు నిలిచిపోనుందన్నారు. అయితే ఆ 44 టోల్ నాకాలు ఎక్కడివన్నది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
మరాఠాలకు 20 శాతం రిజర్వేషన్లు?
విద్యుత్ బకాయిలలో 50 శాతం మాఫీతోపాటు టోల్ బందీలాంటి జనాకర్షక ప్రకటనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే మరాఠా సమాజానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి నారాయణ్ రాణే స్వయంగా అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించారు. ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా మండలి ఎన్నికల నియమావళి అడ్డు తొలగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.