ఇలాగైతే 2020నాటికి కూడా పనులు కావు
మ్యాన్ పవర్ లేదు.. మిషనరీ లేదు.. లక్ష్యం పూర్తయ్యేదెలా
ఉన్నవాటికి మూడు రెట్లు పెంచి పనులు చేయాలి
ఆశించిన స్థాయిలో పనులు జరగట్లేదు.
మిషన్ భగీరథ సమీక్షలో ఉపముఖ్యమంత్రి కడియం
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని ఐదు సెగ్మెంట్ల పరిధిలో మిషన్ భగీరథ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ఇలాగైతే మిషన్ 2020 నాటికి కూడా పూర్తికాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథపై ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, కలెక్టర్ కరుణతో కలిసి జిల్లా అధికారులతో సెగ్మెంట్ల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లాలో పనుల పురోగతి సరిగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మిషన్ పనులు మార్చి 2017నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం పనుల్లో వాడుతున్న సిబ్బంది, మిషనరీ చూస్తుంటే లక్ష్యం పూర్తి కావడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం వాడుతున్న సిబ్బంది, మిషనరీని మూడంతలు చేసి పనులు వేగంవంతం చేయాలని ఆదేశించారు. ఇకపై తాను ప్రతి నెలా మిషన్ భగీరథ పనులు సమీక్షిస్తానని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వారం వారం సమీక్ష ఏర్పాటు చేసుకుని సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించి నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని అన్నారు.
సొంత జిల్లాల్లో పని చేయకపోతే ఎందుకు..
ఇంజినీరింగ్ విభాగంలో ఎక్కువ మంది అధికారులు స్థానిక జిల్లా వారే ఉన్నారని, అలాంటివారు కూడా పనిచేయకపోతే ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు ఇలాగే ఉంటే సొంత జిల్లాల్లో అధికారులను కొనసాగించే విషయంలో ఆలోచించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సెగ్మెంట్ల వారిగా....
-హైదరాబాద్ మెట్రో వర్స్ సెగ్మెంట్‌కు సంబందించి జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గాల పరిధిలో 704 హాబిటేషన్లకు గాను 67 హాబిటేషన్లలో ఈనెలాఖరు నాటికి ఇంటింటికి నల్లాల ద్వారా నీరు అందించాలి. మిగతా 107 హాబిటేషన్లలో అక్టోబర్ ఆఖరు నాటికి నీటిని అందించాలి. మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేసి మొత్తం సెగ్మెంట్లో డిసెంబర్ 31నాటికి నీరు అందజేయాలి.
-పాలేరు సెగ్మెంట్‌కు సంబంధించి పనులు అగ్రిమెంట్ పూర్తయి సంవత్సరం దాటినా ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు పనులు జరగడం లేదు. క్వాలిటీ కంట్రోల్ వారు తనిఖీలు చేయాలి. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కొద్దిపాటి ఇబ్బంది జరిగినా మొత్తం అబాసు పాలవుతాం.
- పరకాల-వరంగల్ సెగ్మెంట్ పరిధిలో అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ విషయంలో అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్యం చేరుతాం.
- గోదావరి- మంగపేట సెగ్మింట్ విషయంలో మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారంలో పైప్‌లైన్ పనులు అటవీ ప్రాంతంలో చేపట్టాల్సి ఉంటుంది. ఎక్కువ అటవీ ప్రాంతం నష్టపోకుండా పనులు చేయాలి. పనులు వేగంగా జరిగేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అధికారులు అన్వేషించాలి.
- మంథిని- భూపాలపల్లి సెగ్మెంట్ విషయంలో క్షేత్రస్థాయి సమస్యలు అధికారులు, ఏజెన్సీ వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలి. విభజన తర్వాత కూడా పనుల్లో వేగం తగ్గకుండా సమన్వయంతో పనిచేయాలి. సమావేశంలో ఎస్ఈ సురేష్‌కుమార్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్ఈ ఏసురత్నం, డీఎఫ్‌వోలు, ఆర్డీవోలు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.