పీఏసీఎస్‌ల ద్వారా విత్తనాలు
కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. రాయితీ విత్తనాల సరఫరాపై సహకార సంఘాలకు, కేడీసీసీ బ్యాంకు అధికారులకు బుధవారం బ్యాంకులో అవగాహన సదస్సుఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులతోపాటుగా రుణాలను, పండిన పంటను మార్కెటింగ్ చేసేవరకు అన్నింటినీ మాక్స్ సొసైటీల ద్వారానే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాల అమ్మకానికి అవసరమైన లెసైన్సులను వెంటనే తీసుకోవాలని సూచించారు. రైతు ఇంటి ముందే అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారుల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. స్థానిక వీఆర్వోల సహకారంతో ఎరువులు, విత్తనాలు అంచనాలను రూపొందించాలన్నారు. రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల సహకారంతో ఇస్తామన్నారు. రైతులు రుణ అర్హత కార్డుల కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పత్తికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి
రైతులు పత్తి పంటకు బదులు ఇతర పంటలను సాగు చేయాలని తెలిపారు. ప్రపంచ దేశాలు పత్తి దిగుమతులపై అనేక ఆంక్షలు విధించినందున మన దేశం నుంచి విదేశాలకు పత్తి ఎగుమతులు బాగా తగ్గాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు సోయాబీన్, పప్పు దినుసులు తదితర పంటలను సాగు చేయాలన్నారు. ప్రతి సంఘంలో సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు. డీసీవో అంబయ్య, జేడీఏ సుచరిత, డీసీసీబీ సీఈవో సత్యనారాయణ, డీఎల్పీవో చంద్రప్రకాశ్ ఉన్నారు.
ప్రణాళికాబద్ధంగా హరితహారం కార్యాచరణ
పకడ్బందీ ప్రణాళికతో హరితహారం కార్యాచరణ చేపట్టి లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, రెవెన్యూ, మండలపరిషత్ అధికారులతో హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. వర్షం పడే సంకేతాలున్నందున హరితహారం కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. గుంతలు తవ్వే కార్యక్రమం మొదలుపెట్టాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.
మిషన్‌కాకతీయ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయని, చెరువుగట్లపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. మొక్కలునాటడం, సంరక్షణకు దత్తత చేయాలన్నారు. విద్యాసంస్థలు, రైస్‌మిల్లులు, పెట్రోల్ పంపులు, ఎన్టీపీసీ, సింగరేణి తదితరాలను సంప్రదించి వారి సహకారం తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డివిజనల్ ఫారెస్ట్ అధికారులు టి.రవికిరణ్, సీపీ వినోద్‌కుమార్, కె.మహేందర్‌రాజు, డ్వామా పీడీ వైవీ గణేశ్, జడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, ఎఫ్ఐఆర్ డబ్ల్యూఎస్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.