సారీ... సమ్మక్క
వనదేవతను మరిచిన ఉన్నతాధికారులు
పునర్విభజన నోటిఫికేషన్లో పొరపాటు
తాడ్వాయి మండలంగా ప్రకటన
ఆదివాసీ సంఘాల అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్లో తప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాల విషయంలో అయోమయానికి గురి చేసి సవరణ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు... ప్రతిష్టాత్మక విషయాలను మరిచిపోయారు. వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాముఖ్యతను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న మేడారం జాతర జరిగే తాడ్వాయి మండలాన్ని సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చారు.
2014 జాతర సమయంలో ఈ మేరకు రాష్ట్ర పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో కలిపారు. అయితే రెవెన్యూ శాఖ మాత్రం తాడ్వాయి మండలంగానే ముసాయిదాలో పేర్కొంది. ప్రతిష్టాత్మక సమ్మక్క–సారలమ్మ ప్రాశస్త్యాన్ని తెలిపేలా ప్రభుత్వం మార్చిన పేరును కాకుండా కేవలం తాడ్వాయిగా పేర్కొనడంపై ఆదివాసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాల పునర్విభజన విషయంలో అంతా రహస్యం అన్నట్లుగా వ్యవహరించిన రెవెన్యూ ఉన్నతాధికారులు ముసాయిదాను తప్పుల తడకగా రూపొందించారు. వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయినట్లుగా వ్యవహరించారు. జిల్లా కేంద్రంగా మార్చాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామ మండలాన్ని కనీసం ముసాయిదాలో చేర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాల పునర్విభజనలో మొత్తం ముసాయిదాపైనే న్యాయపరమైన సమస్యలు వచ్చేలా దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం.
రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ పొరపాటును గుర్తించి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కొత్త మండలాల ఏర్పాటు విషయంలోనూ జిల్లా అధికారుల తీరు ఇలాగే ఉంటోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల మ్యాపులను తయారు చేయడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ గ్రామాలు ఎక్కడ ఉంటాయి, చెరువుల పరిస్థితి, వాటి ఆయకట్టు ఏమిటనేది తెలియక ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముసాయిదా వెల్లడించి వారం రోజులు దాటినా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లుగానే ఉంటున్నారు.