అవసరాల బాగా బిజీ!
ఇండస్ట్రీలో హీరోలను ‘బాబు’ అనడం కామన్. దర్శక–నటుడిగా వరుస సినిమాలు చేస్తోన్న అవసరాల శ్రీనివాస్ మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడీ హీరోగారు కూడా బాగా బిజీ అట! సాధారణంగా సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అవసరాల సినిమాలో నలుగురమ్మాయిలు మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి నటిస్తున్నారు.
నలుగురు హీరోయిన్లు ఉంటే సినిమాలో హీరో బిజీగానే ఉంటారు కదా! అందుకేనేమో అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారంను దర్శకునిగా పరిచయం చేస్తూ అభిషేక్ నామా నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రానికి ‘బాబు బాగా... బిజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ హిట్ ‘హంటర్’కి తెలుగు రీమేక్ ఇది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత.