బెంగాల్ బంద్ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతోపాటు మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’పై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జనాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయాల్సి వచి్చంది. బీజేపీ కార్యకర్తలు రైలు పట్టాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రోడ్లపై బైఠాయించిన బీజేపీ మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ చటర్జీ, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఎమ్మెల్యేల అగ్నిమిత్ర పాల్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ‘బంగ్లా బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. వ్యాపార, విద్యా సంస్థలు, కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డాయి. రోడ్లపై ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని కోల్‌కతాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు! ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఇందులో నిజం లేదని, ఆ ఇద్దరు కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి్పంచామని తెలిపారు. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తుపాకీతో కాల్పులు జరిపారని బీజేపీ మాజీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బంద్‌పై పిటిషన్ కొట్టివేత బీజేపీ తలపెట్టిన 12 గంటల బంగ్లా బంద్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సంజయ్ దాస్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కోర్టులో ఇష్టారాజ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయకుండా గతంలోనే ఆయనపై నిషేధం విధించామని న్యాయస్థానం తేలి్చచెప్పింది. నిషేధం అమల్లో ఉండగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ సంజయ్ దాస్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 10 రోజుల్లోగా పశి్చమ బెంగాల్ స్టేట్ లీగల్ సరీ్వసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం పశ్చిమ బెంగాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకు ఖండిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆందోళనలు విరమించి, విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరగా జూనియర్ డాక్టర్ల ఫోరమ్ అందుకు నిరాకరించింది.నిందితుడితో సంబంధం ఉన్న ఏఎస్ఐకి పాలిగ్రాఫ్ టెస్టు జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌తో సంబంధాలున్న ఏఎస్ఐ అనూప్ దత్తాకు సీబీఐ అధికారులు బుధవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ కేసులో అనూప్ దత్తాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎనిమిది మందికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనూప్ దత్తా కోల్‌కతా పోలీసు వెల్ఫేర్ కమిటీలో పనిచేస్తున్నాడు. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగాక నిందితుడు సంజయ్ రాయ్ ఈ విషయాన్ని అనూప్ దత్తాకు తెలియజేసినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.