‘శ్రీ విష్ణు’ క్యాంపస్లో సోలార్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరెంటు సమస్యల నుంచి గట్టెక్కేందుకు విద్యా సంస్థలు కూడా ప్రస్తుతం సౌర విద్యుత్ వైపు మళ్లుతున్నాయి. తాజాగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తమ క్యాంపస్లో 200 కి.వా. రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసుకుంది. సంస్థ చైర్మన్ కె.వి. విష్ణురాజు, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం. కమలాకర్ బాబు శనివారం దీన్ని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 2.6 కోట్లు కాగా, కేంద్రం 30 శాతం మేర గ్రాంట్ ఇస్తోంది. దీనితో ఏటా 3 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇది దాదాపు 10 శాతం మేర క్యాంపస్ విద్యుత్ అవసరాలను తీర్చగలదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.