రైతును నట్టేట ముంచిన బాబు దొంగ హామీలు
- పట్టిసీమతో ఉత్తరాంధ్రకు నష్టం
- అడ్డగోలు నిర్ణయాలతో రాష్ర్ట అభివృద్ధి వెనక్కి
- ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు
మాడుగుల: చంద్రబాబు అడ్డగోలు హామీలు అన్నదాతలను నట్టేట ముంచాయని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం మాడుగుల వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రుణ మాఫీ పేరుతో విడతలుగా ఇస్తున్న సొమ్మువడ్డీలకే చాలడం లేదన్నారు. ఓటుకు నోటు కేసు నడుస్తుండగా సెక్షన్ 8ని తెర మీదకు తీసుకు రావడంలో అర్థంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా పట్టిసీమను తెరమీదకు తీసుకురావడంవలన పోలవరం ఎడమ కాలువ ఆయకట్టులో ఉన్న తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుండగా, చంద్రబాబు అడ్డగోలు నిర్ణయాలతో మన రాష్ట్రం వెనక్కు వెళుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బాలవాడీలు ఇపుడు కనిపించడంలేదన్నారు. ఇసుక మీద ఆంక్షలు విధించి, గ్రామాలలో బాత్రూములు నిర్మించుకోవడానికి నాటు బండితో ఇసుక తీసుకువస్తున్నా ఎర్ర చందనం స్మగ్లర్లులా చూస్తూ కఠినమైన కేసులు పెట్టడం ఎప్పుడూచూడలేదని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత వాసులకు ఇసుక దక్కకుండా బడా కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గొళ్లవిల్లి సంజీవరావు, వేమవరపు రామ ధర్మజ, పడాల అప్పలనాయుడు ఆడారి కన్నారావు తదితరులున్నారు.