రాష్ట్రంలో రాక్షస పాలన
కదిరి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తెలిపారు. స్థానిక అత్తార్ రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించినఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజలను ఎవరిని కదిపినా రాక్షస పాలన సాగుతోందంటున్నారని ఎమ్మెల్యే టీడీపీ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. మోసపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.
ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన మొదటి 5 సంతకాల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులను, ఇలా అన్ని వర్గాలను ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ‘రైతులెవ్వరూ ఒక్క రూపాయి కూడా అప్పు చెల్లించద్దని ఎన్నికలకు మునుపు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆధార్, రేషన్ కార్డు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణమాఫీకి సవా లక్ష లింకులు పెడుతూ రైతులు, అక్క చెల్లెమ్మలను ఉసూమనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీకి మంచి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ సిద్దారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా పూర్తి కాలేదని, అప్పుడే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు.
పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేశ్వర్‌రెడ్డి అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వేమల ఫయాజ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కిన్నెర కళ్యాణ్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏ క్రిష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి కుర్లి శివారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జైనుల్లా, కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, శివశంకర్, జెడ్పీటీసీ మేకల ప్రమీళమ్మ, ఎంపీటీసీలు లక్ష్మిదేవి, రామక్రిష్ణమ్మ, సూర్యనారాయణమ్మ, శిరీషా, సర్పంచ్ ఇంద్రప్రసాద్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కందికుంటపై ఎమ్మెల్యే ధ్వజం
సమావేశంలో ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా మాట్లాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ధ్వజమెత్తారు. ఇటీవల కందికుంటు ఎమ్మెల్యే చేసిన విమర్శలకు ఘాటుగా సమాధనమిచ్చారు. తాను ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తున్నానన్నారు.
కంది కుంటలా బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చి ప్రజ లను వెంట తిప్పుకోవడం లేదన్నారు. మైనారిటీలు గాలిలో గెలుస్తున్నారని కందికుంట అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు నిజాం వలీ, రసూల్‌సాబ్, మహమ్మద్ షాకీర్ తదితరులందరూ జనం ఆదరిస్తేనే గెలి చి మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. టీడీపీ హవాలో కూడా గెలవలేని కందికుంట మైనారిటీలను తక్కువ అంచనా వేసి విమర్శిస్తే తగిన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు.