కొలువుదీరిన కొత్త జెడ్పీ
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పరిషత్ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. నూతనంగా ఎంపిక చేసిన జిల్లాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేదర్, కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారీ సమక్షంలో కమాన్‌పూర్ జెడ్పీటీసీ పుట్టమధుతో కలెక్టర్ శ్రీదేవసేన జెడ్పీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మధు ప్రమాణం చేశారు. అనంతరం వైస్ చైర్పర్సన్ మండిగ రేణుకతో కలెక్టర్ ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత 9 మంది జెడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు.
జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు..
పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్ సమీపంలోని నూతన జిల్లాపరిషత్ కార్యాలయాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మొదట ప్రారంభించారు. అనంతరం జోడ్పీ చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్‌తోపాటు 9 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు పుట్టమధును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో జెడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చున్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ రాకేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జాయింట్ కలెక్టర్ వనజాదేవి, పోలీస్‌హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సీఈవో వినోద్‌కుమార్, పంచాయితీ అధికారి సుదర్శన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సమాజానికి మేలు చేసే నాయకుడు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
జెడ్పీ చైర్మన్ పుట్టమధు సమాజానికి మేలు చేసే నాయకుడిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావడానికి భూసేకరణ సమయంలో ఎమ్మెల్యేగా పుట్టమధు పాత్రను గుర్తు చేశారు. ప్రజలు మెచ్చిన నాయకుడిగా కేసీఆర్ గుర్తించి అవకాశం కల్పించారన్నారు. స్వచ్ఛ జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలో అన్నింటి కంటే ముందు పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ జిల్లాగా ఏర్పాటవుతుందనే ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాక్షేత్రంలో ఉంటే అవకాశాలెన్నో..ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ప్రజల మధ్య ఉన్న నాయకులకు అవకాశాలు ఎదురుగా వస్తాయని పుట్టమధు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే శాసనసభ్యులుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైంది.. ఈదశంకర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్
1952లో మొదలైన పంచాయతీరాజ్ చట్టం వివిధ కోణాల్లో బలోపేతం చేశారన్నారు. గాంధీజయంతి రోజు ఆరంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 30 లక్షల మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. మూడంచెల విధానంతో దేశంలో 2,34,674 గ్రామపంచాయతీలు, సమితులు, మండలాలు, జిల్లా పరిషత్‌లు ప్రజలకు సేవలందిస్తున్నయన్నారు. ఇలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థకు మరింత పదును పెట్టారన్నారు. కార్యక్రమంలో చిరుమల్ల రాకేశ్, జెడ్పీ వైస్‌చైర్మన్ మండిగ రేణుక, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లాలోని జెడ్పీపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలే దేవుళ్లు.. జెడ్పీ చైర్మన్ పుట్టమధు
తనకు అమ్మ నాన్నలు ఎలా ఉంటారో తెలియదు.. బాల్యంలోనే వారిని కోల్పోయిన నాకు ప్రజలే అమ్మానాన్న, దేవుళ్లు అని జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్టమధు మాట్లాడారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను పేదరికాన్ని చూశానన్నారు. అన్న య్య సహకారంతో పెరిగి పెద్దయ్యాను. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చేరి జెండా మోసి ఇప్పుడు జెడ్పీ చైర్మన్‌గా జనం ఆదరణతో ఎన్నికయ్యానని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ముందు వరుసలో ఉంటానని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశం, జనం దీవెనలతో వచ్చిన పదవిని ప్రజాసేవకే ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.