అధికార పార్టీ ఎమ్మెల్యే బరితెగింపు
► అధికారులూ.. సిగ్గు.. సిగ్గు
► టీడీపీ జిల్లా కార్యాలయంలో
అధికారులతో సమీక్షలు
► కమిషనర్‌తో సహా కొందరు
జిల్లా అధికారులు హాజరు
► ఆదేశించగానే పరుగులు
పెడుతున్న యంత్రాంగం
► దామచర్ల తీరుపై సొంత పార్టీ
నేతలు, అధికారుల విమర్శలు
ఒంగోలు : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యవహారం. కేవలం ఒంగోలు ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ తన హోదాకు మించి అధికారం చలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తరచూ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ కమిషనర్‌తో సహా జిల్లా స్థాయి అధికారులను టీడీపీ జిల్లా కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదు కూడదంటూ ఇక్కడ నుంచే హెచ్చరికలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే తీరుపై అటు సొంత పార్టీ నేతలు ఇటు అధికార వర్గాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంగోలు నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఆనవాయితీగా మారింది. తాజాగా సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ డీడీ, మున్సిపల్ ఇంజినీర్, మరికొందరు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదేశించటమే తడవుగా అధికారులు టీడీపీ కార్యాలయానికి పరుగులు పెట్టారు. మూడు గంటల పాటు ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా అధికారులు చేయాల్సిన పనుల చిట్టాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారుల ముందుంచారు. జీ హుజూర్ అంటూ అన్నింటికీ తల ఊపి అధికారులు వెనుతిరిగారు.
స్వామి భక్తిని చాటుతున్న అధికారులు..
ఇటీవల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం మంత్రి, ఇన్చార్జి మంత్రి ఉత్తర్వుల కంటే ఎమ్మెల్యే దామచర్ల ఉత్తర్వులకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పార్టీ కార్యాలయానికి అర్థరాత్రి రమ్మన్నా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ అధికార కార్యక్రమాల వేదికలపైనా అసలు విషయాలను వదిలిపెట్టి కొందరు అధికారులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచేత్తి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఇటీవల కొత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒక జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి ఎమ్మెల్యే పుణ్యంతోనే తాను జిల్లాకు అధికారిగా వచ్చానని బహిరంగంగానే ప్రకటించారు. దీన్ని చూస్తే అధికారుల దిగజారుడు తనం తేటతెల్లమవుతోంది. ఎమ్మెల్యే సీఎం సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతోనే కొందరు అధికారులు ఆయనకు గులాములుగా మారుతున్నారన్న ప్రచారం ఉంది. ఎంత స్వామి భక్తి ఉన్నా... జిల్లా స్థాయి అధికారులు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నిర్వహించే సమీక్షలకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులే పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారని ఓ జిల్లా స్థాయి అధికారి పేర్కొన్నారు. అధికారులను పార్టీ కార్యాలయానికి సమీక్షలకు పిలిపించటం సరైంది కాదని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పేర్కొనడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఏనాడూ అధికారుల స్థాయిని దిగజార్చలేదని, నిబంధనల మేరకు మంత్రి కలెక్టర్ కార్యాలయం లేదా తాను విడిది చేసే ప్రభుత్వ అతిథి గృహాల్లోనే సమీక్షలు నిర్వహించారని మరో అధికార పార్టీ నేత పేర్కొన్నారు. ఎమ్మెల్యే తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని, ముఖ్యంగా అధికారుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని సొంత పార్టీకి చెందిన మరో నేత విమర్శించారు. మొత్తంగా ఎమ్మెల్యే దామచర్ల పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు పెట్టడంపై అటు కొందరు ఉన్నతాధికారులు, ఇటు టీడీపీ ముఖ్యనేతలు విమర్శించడం గమనార్హం.