దీక్షా సమరం
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆయనకు బాసటగా ఆమరణ దీక్ష చేస్తున్నవారి సంఖ్య 31కి చేరగా, ఆరోగ్యం క్షీణించడంతో ఇద్దరి దీక్షలు భగ్నం చేశారు. బుధవారం రాత్రికి ఆమరణ దీక్షలో ఉన్నవారి సంఖ్య 29గా ఉంది. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకోగా, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము, నందిగామకు చెందిన గంజి సుందరరావు, విజయవాడ మాజీ కార్పొరేటర్ జవ్వాది రుద్రయ్యల దీక్ష మూడో రోజుకు చేరింది. తిరువూరులో మల్లేల సర్పంచి కలికొండ రవికుమార్‌తోపాటు మరో నలుగురు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి, గుడివాడ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో ఊట్ల నాగేశ్వరరావు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి.
దీక్షలో ‘వాకా’
పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావుతోపాటు మరొకరు ఆమరణ దీక్ష ప్రారంభించగా, నందిగామలో పదిమంది, విజయవాడ తూర్పులో నలుగురు, పెనుగంచిప్రోలులో వేల్పుల పద్మకుమారి ఆమరణ దీక్షకు దిగారు. వీరిలో పలువురి ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ, సుగర్ లెవల్స్ పడిపోవడంతో బెజవాడలో మాజీ కార్పొరేటర్ జవ్వాది రుద్రయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గంజి సుందరరావు ఆరోగ్యం క్షీణించడంతో స్థానికులు నచ్చచెప్పి దీక్ష విరమింపచేశారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు పార్టీ కార్యాలయంలో బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఆయనతో పాటు రాష్ట్ర బీసీ సంఘం మాజీ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు కూడా ఆమరణ నిరాహార దీక్ష లో కూర్చున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఆమరణ నిరాహారదీక్షలో పార్టీ నాయకులు వై.కాశిరెడ్డి, తంగిరాల రామిరెడ్డి, జి.జయరాజు, ఉప్పులేటి అనిత పాల్గొన్నారు. దీక్షలను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రారంభించారు. నందిగామ గాంధీ సెంటర్లో 10 మంది నాయకులు, అభిమానులు ఆమరణ దీక్షలు చేపట్టారు. కుక్కల సత్యనారాయణప్రసాద్, నెలకుర్తి సత్యనారాయణ, నాదెండ్ల రాజన్, వినుకొండ రామారావు, మార్కపూడి ప్రసాదరావు, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజాపీరా, విశ్వనాథపల్లి కృపారావు, మొండితోక నారాయణరావు, వంకాయలపాటి సుధాకర్‌లు ఆమరణ దీక్షలో కూర్చున్నారు.
వీరి దీక్షలను నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. పెడనలో నిరాహార దీక్ష చేస్తున్న ఆ పార్టీ సమన్వయకర్త ఉప్పాల రమేష్ (రాము)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. రాముకు పెడన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం ప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ వన్‌టౌన్ మెయిన్ పోస్టాఫీసుకు తాళాలు వేసి నిరసన తెలుపగా, సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్ పోస్టాఫీసుకు తాళాలు వేసి నిరసన తెలిపారు.
లెనిన్ సెంటర్లో గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో రిలేదీక్షలు జరిగాయి. వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మండవల్లి మండలం కొర్లపాడు గ్రామానికి చెందిన 30 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. మైలవరం మండలం పుల్లూరు గ్రామం నుండి జగన్ అండ్ అప్పిడి యూత్ అధ్వర్యంలో జగన్ దీక్షకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించి మైలవరంలోని డాక్టర్ హనిమిరెడ్డి ప్రభుత్వ హైస్కూల్ వద్ద వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు.
నూజివీడులో జగన్ దీక్షకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలేదీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలలో భాగంగా నూజివీడులో 16మంది, చాట్రాయిలో 21మంది పాల్గొన్నారు. నూజివీడులో రెండోరోజు దీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. మొవ్వ మండలంలో మూడో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. చాట్రాయి రామాలయ ఆవరణలో వైఎస్సార్ సీపీకి చెందిన 25 మంది కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేశారు. విస్సన్నపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జలదీక్ష నిర్వహించారు. పార్టీ కొండపల్లి గ్రామ కన్వీనర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డిగూడెం నుంచి మైలవరం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.