సఖ్యత ముఖ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభివృద్ధి పనులే ఎన్నికల్లో గెలిపిస్తాయనుకోవద్దు.. ప్రజలతో కలుపుగోలుగా వ్యవహరిస్తేనే రాజకీయాల్లో రాణిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హితబోధ చేశారు. ‘మీరు చాలా పనులు చేశారు. కానీ పనులు చేస్తేనే ఎలక్షన్లలో గెలవలేం. పనులతోపాటు అందరినీ కలుపుకుపోవాలి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.. అని చురకలంటించారు. సోమవారం మేడ్చల్ మండలంలోని కండ్లకోయలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం.. చివరలో ఎమ్మెల్యే తీరును తనదైనశైలిలో ప్రస్తావించారు. ‘పనులు, అభివృద్ధి ఒకవైపు.. ప్రజలను కలుపుకుపోవడం మరోవైపు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకుసాగాలి. నేను ఐదుసార్లు ఎన్నికల్లో పోటీచేశాను. ఇదే నా సక్సెస్ సీక్రెట్’ అని అన్నారు. ఉత్సాహవంతంగా పనిచేసే కేఎల్లార్ కార్యకర్తలను కూడా అదే తరహాలో ప్రోత్సహించాలని సూచించారు.
మంత్రి ప్రసాద్ గైర్హాజరు
తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి జిల్లా పర్యటనకు మంత్రి ప్రసాద్‌కుమార్ డుమ్మా కొట్టారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వర్గీయుడిగా పేరున్న ప్రసాద్ ఇటీవల తెలంగాణ లాబీయింగ్‌లో కీలకంగా పనిచేశారు. దామోదరతో కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం వె లువడినప్పటి నుంచి సీఎంతో ‘టీ’ మంత్రులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం పర్యటనలో తెలంగాణ మంత్రులెవరూ కనిపించలేదు. ఆఖరికి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా గైర్హాజరు కావడం చర్చానీయాంశంగా మారింది. కాగా, కేంద్ర మంత్రి ఆంటోనీతో భేటీ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లినందున సీఎం కార్యక్రమానికి ప్రసాద్ హాజరుకాలేకపోయారని సన్నిహితవర్గాలు తెలిపాయి.
మరోవైపు గత మూడు నెలలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సబితా ఇంద్రారెడ్డి వనమహోత్సవంలో పాల్గొన్నారు. సీబీఐ కేసు నమోదుతో అన్యమనస్కంగా ఉన్న సబిత మంత్రి పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కస్టడీకి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఊరట పొందిన సబితారెడ్డి సీఎం పర్యటనతో మళ్లీ క్రియాశీలమవుతున్నట్లు అర్థమవుతోంది.