హరికృష్ణ రాజీనామా ఓ డ్రామా: కేఈ కృష్ణమూర్తి
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: టీడీపీ నేత నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఓ డ్రామా అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆరేళ్లలో ఏనాడూ ఏ అంశంపైనా నోరు విప్పని హరికృష్ణ.. ఆరు నెలల్లో ముగిసిపోయే పదవిని త్యాగం చేశాననడం హాస్యాస్పదమన్నారు. కేంద్రమంత్రి పురందేశ్వరి నాటకంలో ఆయన ఓ పాత్రధారి అని విమర్శించారు. అసలు హరికృష్ణకు రాజీనామా లేఖ రాయడం కూడా రాదని.. పురందేశ్వరి రాసిస్తే సంతకం పెట్టి ఇచ్చారని కేఈ ఎద్దేవా చేశారు. ఆయన యాత్రతో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టంచేశారు.
అయినా హరికృష్ణకు ఉన్న క్రేజ్, శక్తి ఏపాటివో ‘అన్నటీడీపీ’ పెట్టినప్పుడే తేలిపోయిందని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా 2008లోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చారని, దానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. అయితే రాష్ట్ర విభజనలో ఒక్క టీడీపీనే దోషిగా చూపడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే శక్తి బాబుకు ఉంటే సోనియాను ఎప్పుడో పదవినుంచి దించేవాళ్లమన్నారు. పార్టీతో సంబంధం లేకుండా తాను సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నానని కేఈ స్పష్టం చేశారు.