పండగ సంబరాల్లో.. ఎమ్మెల్యే డాన్సులు
పెద్ద పండగ అంటే చాలు.. కోనసీమలో సంబరాలు మిన్నంటుతాయి. ఆ సంబరాలకు చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే ఓ ఎమ్మెల్యే గారు చిందేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి... పండుగ సందర్భంగా నిర్వహించిన రికార్డింగు డ్యాన్సులో డాన్సర్లతో కలిసి బ్రహ్మాండంగా స్టెప్పులేశారు. 'నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం కాను' అనే పాటకు డాన్సులు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులలో ఆయన కూడా పాల్గొని అక్కడున్న అమ్మాయిలతో చేతులు కలిపి డాన్సులు చేశారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో యథేచ్ఛగా కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డాన్సులు జరిగాయి. సాధారణంగా రాత్రిపూట నిర్వహించే రికార్డింగ్ డ్యాన్సులు ఈసారి అధికార పార్టీ నేతల అండదండలతో పగలే మొదలు పెట్టేశారు. వాడ్రేవుపల్లి. మగటనల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారు విస్తుపోయారు.