మద్దతు ధర మాటేమిటి?
మంత్రి అయ్యన్నను నిలదీసిన చెరకు రైతులు
అడ్డుకున్న ఎమ్మెల్యే రాజు
ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు
బుచ్చెయ్యపేట: టన్ను చెరకుకు మద్ధతు ధర ఎంత..గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు, దవ్వ డబ్బులు ఎప్పుడిస్తారంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పలువురు చెరకు రైతులు నిలదీశారు. ఆదివారం బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని ‘గోవాడ’ రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మంత్రి వివరణ ఇచ్చేలోపే చోడవరం ఎమ్మేల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కల్పించుకుని ఇది సమయం కాదని తర్వాత మాట్లాడుదామని రైతులను వారించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం చెందారు.
మిల్లుకు గతేడాది సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సర్కారు విధానాలతో ఏలా బతకాలని వాపోయారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు గోవాడ ఫ్యాక్టరీని తమకు అప్పగిస్తే టన్నుకు రూ.3500 ధర చెల్లిస్తామంటూ రోడ్డేక్కి ఆందోళనలు చేపట్టిన ఎమ్మేల్యే ప్రస్తుతం మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కడం శోచనీయమని పేర్కొన్నారు. గోవాడ ఫ్యాక్టరీలో రూ.16 కోట్లకుపైగా అవినీతి చోటుచేసుకుందన్న వాదన నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఎమ్మేల్యే రైతులను వారించడంపై విస్మయం వ్యక్తం చేశారు.