ఇది నయవంచన
శ్రీకాకుళం అర్బన్ : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఫిరాయింపు ధోరణి శోచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఒక ప్రకటనలో ఖండించారు. నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో ..ప్రజాస్వామ్య విలువలు కాపాడతారని గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని శాసనసభకు పంపితే కలమట ప్రజలను నయవంచన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారెవరూ ప్రజల మన్ననలు పొందలేరన్నారు.
ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ప్రశ్నించారు. హామీలలో ఒక్కటైనా అమలు చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వం ఏం సాధించిందని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీని కోరడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
పచ్చ చొక్కాలకు ఆ నిధులను కట్టబెట్టేందుకేనన్నారు. వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టు నీరు విడుదల చేస్తామని పనులు ప్రారంభించి, అడ్డుకుంటే లాఠీ చార్జి చేయడంలో ఎవరి ప్రమేయం ఎంతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. అన్ని స్థాయిల వారూ మూల్యం చెల్లించక తప్పదని గుర్తించాలన్నారు.