ఇందూరు టీఆర్ఎస్ లో రగడ
♦ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
♦ భూపతిరెడ్డిపై చేయి చేసుకున్న బాజిరెడ్డి
♦ కాలూరులో ఇరువర్గాల బాహాబాహీ
♦ ఎమ్మెల్సీపై రూరల్ పీఎస్‌లో కేసు
♦ ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు శనివారం బట్టబయలు అయ్యాయి. జిల్లాలోని కాలూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డ్డిల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఇద్దరు, 2 గ్రూపుల మధ్య నెలకొన్న వివా దం చివరకు ఎమ్మెల్సీపై చేయి చేసుకునే స్థాయికి చేరింది. ఘటనపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. నిజామాబాద్ మండలం కాలూర్‌లో మహిళామండలి భవన ప్రారంభోత్సవానికి శనివారం ఏర్పాట్లు చేశారు. ముందుగా గ్రామానికి ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి చేరుకున్నారు. స్వాగత ఫ్లెక్సీలో భూపతిరెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు చర్చపెట్టారు.
ఈలోగా కాలెపల్లి క్యాంపులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కాలూర్‌కు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, వీజీగౌడ్లు మహిళా మండలి భవనాన్ని ప్రారంభించి లోనికి వెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మహిళా మండలి భవనంలోకి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్సీ వర్గీయులు భూపతిరెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదని పార్టీ మండల అధ్యక్షుడైన ముస్కె సంతోష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భూపతిరెడ్డి మరో అనుచరుడు ధర్మారం రమాకాంత్ నిరసన వ్యక్తం చేశారు. నిరసనలతో కార్యక్రమానికి అంతరాయం ఏర్పడడంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే బాజిరెడ్డి బయటకు వచ్చి భూపతి రెడ్డి అనుచరుడు రమాకాంత్‌పై చేయి చేసుకున్నారు.
అక్కడే ఉన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌తో గొడవ పడగా ఆయనపైనా చేయి చేసుకున్నారు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ చెంప ఛెళ్లుమనిపించారు. వెంటనే నిజామాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్ని, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దు మణిగింది.
ఎమ్మెల్సీ, ఆయన వర్గీయులపై కేసు
కాలూరు ఘటనలో తమ విధులకు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆటంకం కల్పించాడని ఎస్‌హెచ్‌వో మున్ని ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు.