రుణమాఫీ చేస్తే... నేను రాజీనామా చేస్తా...!
హైదరాబాద్ : రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంశం శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే నెలన్నర, రెండు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి తీరుతారని చెప్పారు.
ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు... మాఫీ అంత ఈజీ కాదని, రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోనే రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. దీనికి ధీటుగా స్పందించిన సతీష్ రెడ్డి తమ ప్రభుత్వం కచ్చితంగా రెండు మాసాల్లోనే రుణాలను మాఫీ చేసి తీరుతుందని, అయితే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.