చంద్రబాబును ఎ1గా చేర్చాలి
విజయనగరం క్రైం: ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులు బహిర్గతమైన నేపథ్యంలో చంద్రబాబును ఎ1 ముద్దాయిగా చేర్చాలని వైఎస్ఆర్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహరంలో చంద్రబాబు అడ్డంగా దొరికినట్లు తెలుస్తోందన్నారు. హైదరాబాద్... చంద్రబాబు, కేసీఆర్‌ల తాతలదికాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలదన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిన తెలుగుదేశం పార్టీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మభ్యపెట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వాస్తవాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలియజేసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని, ఓటుకు నోటు వ్యవహారంలో కేంద్రం తగిన ఆదేశాలు ఇస్తుందనే భావిస్తున్నామన్నారు. స్టీఫెన్సన్, అనిల్‌కుమార్ బంధువులు అని దేశం నేతలు ఆరోపిస్తున్నారని, దీనిని వారు రుజువు చేయగలరా? అని ప్రశ్నించారు. ఓటుకునోటు వ్యవహారంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య జరుగుతున్న వివాదాల్లోకి జగన్మోహన్రెడ్డిని లాగొద్దని హితవు పలికారు.
ఓటుకునోటు వ్యవహారంలో కేసునుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీవెళ్లి ఎవరి కాళ్లు పట్టుకున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారని.. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒప్పుకుంటున్న చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో తాను మాట్లాడినట్లు ఒప్పుకున్నట్లేనన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.