mlc salaries
-
భారీగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు
♦ నెలకు రూ.1.50 లక్షల వేతనం ♦ ఇంటి అద్దె రూ.50 వేలు ♦ పింఛన్ కూడా భారీగా పెంపు ♦ త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని ఇంటి అద్దెతో కలుపుకుని రెట్టింపు చేయాలని శాసనసభ్యుల సౌకర్యాల కల్పన కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే ఈ పెంపునకు ఆమోదం తెలిపింది. ఆ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత ఫైల్‌పై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నెలకు రూ.95 వేల వేతనం లభిస్తోంది. దాన్ని రూ.1.50 లక్షలకు, ఇంటి అద్దెను రూ.50 వేలకు పెంచనున్నారు. ఈ రెండూ కలిపి ఎమ్మెల్యేలకు రూ.2 లక్షలు వేతన రూపంలో అందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెంటనే పుస్తకాల కొనుగోలు నిమిత్తం రూ.లక్ష ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం వాహనం కొనుగోలుకు ఇస్తున్న రుణాన్ని కూడా రెట్టింపు చేయనున్నారు. ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచనున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. మూడు, అంతకంటే ఎక్కువసార్లు ఎన్నికైన వారికి నెలకు రూ.50 వేలు పింఛన్ రూపంలో ఇవ్వనున్నారు. ఒకటి, అంతకంటే ఎక్కువసార్లు ఎన్నికైన వారికి రూ.40 వేలు పింఛన్‌గా చెల్లించనున్నారని సమాచారం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఈ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచి ఆమోదం పొందనున్నారు. -
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతాల పెంపు !!
- ప్రస్తుతం నెలకు రూ. 95 వేలు - రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు పెంచే యోచన! సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతభత్యాలు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ అంశంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ కార్యదర్శి, అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు పెంచిన నేపథ్యంలో తెలంగాణలో కూడా జీతాలు సవరించాలనే అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, విప్‌లు, ప్రతిపక్ష నాయకులు కేబినెట్ ర్యాంక్ జీతం పొందుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.95 వేల చొప్పున వేతనం తీసుకుంటున్నారు. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం ఏటా రూ.14.94 కోట్లు చెల్లిస్తోంది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో వారికి నెల జీతాలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం సమక్షంలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేల ఖర్చులు ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ శాసన సభ్యులకు రూ.4 లక్షల వరకు వేతనం ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ప్రతిపాదించిన విషయం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులకు చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలు తీసుకున్నారు. అన్నీ చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచాలని, అదే నిష్పత్తిలో కేబినెట్ ర్యాంకున్న చట్ట సభల సభ్యుల జీతాలు పెంచే అంశంపైనా కసరత్తు జరిపారు. ఈ విషయంలో సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.