‘మొబైల్10ఎక్స్’ను ఆవిష్కరించిన ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ డెవలపర్ల వృద్ధికి దోహదపడే విధంగా మొబైల్ ఇంటర్నెట్ సమాఖ్య ఐఏఎంఏఐ ‘మొబైల్10ఎక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 50 వేలుగా ఉన్న మొబైల్ యాప్ డెవలపర్ల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలకు చేర్చడం... అలాగే మొబైల్ యాప్ విభాగం ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి గూగుల్ ఇండియా, పేటీఎం సంస్థలు ప్రారంభ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఐఏఎంఏఐ ఈ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్లలో ఐదు మొబైల్ స్టార్టప్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది.
వీటిని బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పుణే/ముంబై పట్టణాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రాయ్ తెలిపారు. వీటిల్లో డెవలపర్లు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవసరమైన టెస్టింగ్ ల్యాబ్, డిజైన్ ల్యాబ్, కెపాసిటీ బిల్డింగ్ వంటి తదితర సౌలభ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద 5 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై శిక్షణను ఇస్తామని తెలిపారు. భారత్‌లో యాప్ డెవలప్మెంట్కు మంచి అవకాశాలు ఉన్నాయని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆనందన్ పేర్కొన్నారు.