క్లాస్‌లో సెల్ నిషేధం
బజార్హత్నూర్(బోథ్): దేశభవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతోంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అయితే గురువులే క్రమశిక్షణ పాటించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. స్మార్ట్ఫోన్ల రాకతో చాలామంది సర్కారు ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడం అటుంచి ఫోన్లలో మాట్లాడడం, ఆన్లైన్ చాటింగ్‌లతో బిజీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈమేరకు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లకుండా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకు లు కిషన్ అన్ని జిల్లాల విద్యాధికారులకు (జీవో నం.3466 ద్వారా) ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ నెల 6నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉ న్నత, కేజీబీవీ, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలల్లోని త రగతి గదుల్లోకి ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ తీ సుకెళ్లకుండా నిబంధనలు అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అం దాయి.
ప్రధానోపాధ్యాయులకు మినహయింపు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెల్ఫోన్ల వాడకంపై నిషేధం అమలు చేశారు. అన్ని చోట్లా ఉత్తర్వుల అమలుకు కసరత్తు జరుగుతుంది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్‌కు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల వద్ధ ఉపాధ్యా యు లు తమ సెల్ఫోన్లను డిపాజిట్ చేయల్సి ఉం టుంది. తరగతులు పూర్తయ్యాకే వాటిని అప్ప గించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొ న్నారు. మధ్యాహ్న భోజన వివరాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిత్యం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవలసి ఉ న్నందున ఆ సమయంలో వారికి మినహాయిం పు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో స్పెషలాఫీసర్ ఫోన్ మాట్లాడవచ్చు. ఈ విషయాన్ని రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. వీటి అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈవోలకు అప్పగించారు. కాగా ప్రస్తుతం సాంకేతిక యుగంలో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు, విద్యార్థులకు మరింత వివరంగా బోధించేందు కు స్మార్ట్ఫోన్లు దోహదపడుతున్నాయని అందువల్ల వాటిపై నిషేధం సరికాదని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
ఫోన్లతో నష్టపోతున్న విద్యార్థులు
భావిభారత పౌరులను తీర్చిదిద్దే తరగతి గది వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉం టే బోధన అభ్యసన ప్రక్రియ అంత సాఫీగా సాగుతుంది. అయితే ఇటీవల ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్న సమయంలో సెల్ మోగితే మధ్యమధ్యలో బయటకు వెళ్లడం, లేదా విద్యార్థులకు చదువుకోమని చెప్పి ఉపాధ్యాయులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తుండడం ఎక్కువయ్యాయి. ఇదే అదనుగా భావించి విద్యార్థులు సైతం స్మార్ట్ఫోన్లను పాఠశాలకు తీసుకురావడం, తరగతి గదిలోనే ఫోన్లు మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం, అల్లరి చేయడంతో క్రమశిక్షణ తప్పిన విద్యార్థులకు బోధన, అభ్యసన ప్రక్రియ సరిగా లేదని, చివరకి పరీక్ష ఫలితాపై ప్రభావం చూపి విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది.
ఆదేశాలు వెంటనే అమలు పరచాలి
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు డీఈవో జనార్దన్రావ్ బుధవారం జిల్లా కేంద్రంలో డెప్యూటీ ఈవో, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈమేరకు తరగతి గదు ల్లో సెల్ఫోన్లు అనుమతించకూడదని ఎంఈవోలు.. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మెసేజ్‌లు పంపి విద్యాశాఖ ఆదేశాలు పాటించాలని సూచించారు.
జిల్లాలోని పాఠశాలలు
జిల్లాలో 929 ప్రాథమిక పాఠశాలలు, 112 ప్రాథమికోన్నత పాఠశాలలు, 106 జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలతో పాటు ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాలు 31, కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలు 18, ఆదర్శ పాఠశాలలు 6 ఉన్నాయి. ఇందులో సుమారు 4500 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఎవరు కూడా తరగతి గదులు, పాఠశాల ఆవరణలో సెల్‌ఫోన్ వినియోగించరాదని నిబంధనల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు తరగతి గదిలో పూర్తి సమయం బోధనకు కేటాయించడం, విద్యార్థులపై శ్రద్ధ కనబరచడంతో పాటు విద్యార్థుల ఏకాగ్రత, అభ్యాసన సామరŠాధ్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, క్రమశిక్షణ అలవడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.