
అమ్మాయిలకు ఫోన్లు బంద్!
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు నిషేధించారు. మైనర్ బాలికలు ఫోన్లు ఉపయోగించొద్దని ఈ నిబంధనను అతిక్రమిస్తే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని మెహన్సా జిల్లాలో గల సూరజ్ అనే గ్రామంలో చదువుకుంటున్న మైనర్ బాలికలు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించొద్దని వాటిని ఉపయోగించడం మూలంగా వారి ప్రవర్తన దెబ్బతింటుందని, చదువులపై తీరని ప్రభావం పడుతుందని పేర్కొంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిపాదన చేశారు.
దీనికి ఆ గ్రామ పంచాయతీ మూకుమ్మడిగా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.2100 ఫైన్ చెల్లించాలంటూ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు అమ్మాయిలకు, వారితల్లిదండ్రులకు సమస్యలుగా పరిణమించాయని, వీటి కారణంగా అమ్మాయిలు తేలిగ్గా ప్రేమ అనే మాయలో పడటమే కాకుండా ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోతున్నారని వారు ఆ గ్రామస్తులు అంటున్నారు. అందుకే తాము తెచ్చిన ఈ ప్రతిపానకు దళితులు, పటేళ్లు, ఠాకోర్ లు, రాబారిలు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ఇక నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిల చేతుల్లో కనిపించబోవని చెప్పారు.