స్మగ్లర్ సంగీత ఆస్తులు సీజ్
చిత్తూరు (అర్బన్): అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీకి చెందిన రూ. కోటి విలువైన బంగారు, వెండి వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. శనివారం చిత్తూరులో విలేకరులతో ఓఎస్డీ రత్న కేసు వివరాలను వెల్లడించారు. చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను చిత్తూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించారు. దీంతో అతని రెండో భార్య సంగీత చెన్నైకి చెందిన గురుస్వామి, ఢిల్లీలోని పలువురు స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసింది.
ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు 2 నెలల క్రితం సంగీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 9న కోల్‌కతాలోని సంగీత బ్యాంకు లాకర్లను తెరిచి 2.5 కిలోల బంగారు ఆభరణాలు, విదేశాలకు చెందిన 150 నాణేలు, తొమ్మిది సెల్ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, రూ.60 లక్షల విలువ చేసే ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుని, రూ.90 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.