జిల్లాలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు
రాప్తాడు : జిల్లాలో 414 మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో అవసరమైన సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను మండలాల వారీగా సమర్పించాలని ఎంఈవోలను డీఈవో అంజయ్య ఆదేశించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై స్థానిక పంగల్ రోడ్డులోని ఆర్డీటీ అంధుల పాఠశాలలో అనంతపురం, గుత్తి డివిజన్ ప్రాంతాలకు చెందిన ఎమ్మీవోలు, హెచ్ఎంలకు మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రతి పాఠశాలకు ఐదు తరగతి గదులు, ఐదుగురు ఉపాధ్యాయులను నియమించి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎస్ఎస్ఏ పీవో దశరథరామయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పరిచినప్పుడే విద్యార్థులను ఆకర్షించగలమనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. అనంతరం మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు మూలాలు, ప్రధాన లక్ష్యాలు, మార్గదర్శకాలు, నియామకాలు, నిర్వహణలో అధ్యాపక బృందం పాత్ర తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్ విజయ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో పెనుకొండ డిప్యూటీæడీఈవో సుబ్బారావు, ఎఎంవో చిన్నకృష్ణారెడ్డి, అనంతపురం, గుత్తి డివిజన్ల హెచ్ఎంలు, ఎంఈవోలు పాల్గొన్నారు.