మోడల్ పట్టణంగా అనకాపల్లి
రూ.65 కోట్లతో శాశ్వత మంచినీటి ప్రణాళిక
ఏలేరు కాలువ నుంచి నీటి మళ్లింపు
ఆధునిక బస్షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్
జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ
అనకాపల్లిరూరల్: అనకాపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ వాసుల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.65 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
అలాగే రూ.70 లక్షలతో పాతపైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తామని చెప్పారు. పూడిమడక రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.18.5 లక్షలతో నూకాంబిక గుడి, వేల్పులవీధి, చిరంజీవి బస్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే రూ.3.5 లక్షలతో ఆధునిక బస్షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు.
మున్సిపల్ మైదానం వద్ద ఇద్దరు నైట్వాచ్మన్లను, లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీటి వృథా అరికట్టేందుకు రూ.2.65 లక్షలతో కుళాయిలకు హెడ్స్ బిగిస్తామని చెప్పారు. కొత్తగా 20 చోట్ల బోరుబావులు తవ్విస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న 400 బీపీఎల్ కుళాయి కనెక్షన్లు తక్షణం మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం
పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని చెప్పారు. శారదనగర్లో ప్రస్తుతం ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.వి.జగన్నాథరావు పాల్గొన్నారు.