ఖగోళశాస్త్ర పరిజ్ఞానమే ఉగాది..
కాలాన్ని గణించడానికే సమాధులపై రాళ్లు..
నాటి ఖగోళ జ్ఞానమే పంచాంగం
హన్మకొండ కల్చరల్ : మనిషి తాను ఎక్కడ, ఎలా, ఎందుకు జీవిస్తున్నాడో తెలు సుకోవడానికి నిరంతరం యత్నిస్తూనే ఉన్నాడు. ఈ సృష్టి ఎలా, ఎప్పటి నుంచి ఏర్పడింది? ఎన్ని రోజులుగా కొనసాగుతుంది? అనే ప్రశ్నలు మనిషిని వెంటాడుతునే ఉన్నాయి. సృష్టిని మనిషి ఊహకు అందని మాయ అని భావించారు. మాయ అనే కాగులోనే సమస్త లోకం సృష్టించబడిందని భావించారు. అందుకే కాలాన్ని పురుషుడిగా భావించారు.
కాలపురుషుడే మాయ అనే కాగులో రాత్రి, పగలును ఇంధనంగా వాడి సమస్తలోకాన్ని సృష్టించారని, దివా రాత్రులనే ఇంధనంతో వండుతున్నాడని, ఇందుకోసం సూర్యుడు, అగ్ని, రుతువులు, మాసాలను తెడ్లమాదిరిగా వినియోగించుకుంటున్నాడని, లేకపోతే సమస్తలోకం ఒకేలా ఉండదని మహాభారతంలో ధర్మరాజు తెలిపారు. కాలం తెలియకపోవడం, కాలం తెలిసి ఉండటం అనేది మానవ పరిణామక్రమంలోని అత్యంత క్లిష్టమైన ముఖ్యమైన అభివృద్ధి. నేటి ఆధునిక భౌతికశాస్త్రం కూడా కాలగమన సిద్ధాంతం ఆధారంగానే సుదూరగ్రహాలకు వ్యోమనౌకలను పంపిస్తోంది.
50 వేల ఏళ్ల క్రితమే కాల గణన
50 వేల ఏళ్ల క్రితం శిలాయుగ నాగరికతలో జీవిం చిన మనిషి కూడా కాలాన్ని గణించుకుని జీవించాడంటే నమ్మగలమా? రాక్షసగుడులుగా (మెగాలిథిక్ బరియల్స్) మనం పిలుచుకుంటున్న ఆ కాలం నాటి సమాధులు వాటి చుట్టూ పేర్చిన అతిపెద్ద బండరాళ్లు కేవలం సమాధులే కాదని, అవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించారని శాస్త్రవేత్తల అభిప్రాయం. చనిపోయిన తమ పెద్దల పవిత్రమైన ఆత్మలను పూజించడానికే కాక గణిత, ఖగోళ, భౌతిక, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలెన్నో ఈ రాళ్లతో తెలుసుకునేవారు. ఇవి కాలాన్ని గణించి రుతువులను, కాలాన్ని అర్థం చేసుకుని కాలవైపరీత్యాల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడేవి. సూర్య, చంద్ర, శుక్రగ్రహల కదలికలను గమనించి వాటి ద్వారా కాలాన్ని లెక్కించేవారు.
చుట్టూ ఉన్న రాళ్ల మధ్యలోని కేంద్ర స్థానా న్ని గుర్తించడం, కేంద్రస్థానం నుంచి ఒక్కో రాయి మధ్య ఉన్న దూరాన్ని గణించడం, మళ్లీ ఒక్కోరాయికి మధ్య ఉన్న దూరాన్ని కొలిచి గణించడం ద్వారా ఒక్కొక్క సమాధి ప్రత్యేకతను తెలుసుకోవచ్చు. మెన్హీర్ అని పిలవబడే సమాధులు పొడవాటి రాళ్లను పాతినట్లు ఉంటాయి. ఇవి వర్ధన్నపేట, జనగామ తదితర చోట్లలో కనిపిస్తాయి. వీటిని అమర్చిన విధానం కొద్దిగా ఏటవాలుగా వంగి ఒక్కొక్క నెలను పౌర్ణమితో గుర్తించే విధంగా ఉంటాయి. చంద్రుడు 29.5 రోజులకు ఒకసారి భూమిని చుట్టి వస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరకాలం పడుతుంది.
ఇది మనకు తెలిసినది మాత్రమే కాదు వేలాది ఏళ్ల క్రితమే నాగరికత లేదనుకున్న చీకటి యుగపు శిలాయుగంలోనే అప్పటి మనుషులు చంద్రుడిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణించడం ఆశ్చర్యం. 11, 12, 13 సంఖ్యల్లో ఈ రాళ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. నవీన విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో వేలాది ఏళ్లుగా ఈ రాళ్ల పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకోనేవారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు పూర్తిగా ఈ రాళ్లు తొలగించబడి ఉనికిని కోల్పోయాయి.