వివాహిత అనుమానాస్పద మృతి
ఎమ్మిగనూరు రూరల్, న్యూస్‌లైన్: అత్తింటి వేధింపులు ఓ మహిళ ప్రాణం తీశాయి. భర్త చిత్రహింసలు, అత్త, ఆడ పడుచుల సూటిపోటి మాటలు తాళలేక ఆమె చావే శరణ్యమనుకుంది. ప్రతీ రోజు బిడ్డను నిద్ర పుచ్చే ఊయలను ఉరి తాడుగా మార్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ బోర్డు సమీపంలో నివాసముంటున్న మోహరూన్ బేగం(20) ఉరి వేసుకుని మృతి చెందింది. నాగలదిన్నె గ్రామానికి చెందిన మోహరూన్బేగంకు ఎమ్మిగనూరుకు మోఫీస్తో రెండు సంవత్సరాల కిత్రం వివాహమైంది. కట్నం కింద తల్లిదండ్రులు రూ. 1.10 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చారు. అయితే పెళ్లైన నెల రోజులు మాత్రమే సంసారం సజావుగా సాగింది.
రెండో నెల నుంచే అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, ఆడపడుచులు వేధించారు. వారి వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. అనంతరం పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి తిరిగి పంపించారు. కాన్పునకు పుట్టింటికి వచ్చిన ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు గడుస్తున్నా భర్త ఇంటి నుంచి ఎవరు చూడటానికి వెళ్లలేదు. రెండు నెలల కిత్రం భర్త మోఫీస్ తన భార్యను పంపాలని పెద్ద మనుషులను వెంటబెట్టుకొని నాగలదిన్నెకు వెళ్లాడు. తమ కుమార్తెతో వేరే కాపురం పెడితేనే పంపుతామని త ల్లిదండ్రులు చెప్పటంతో సరేనని వెంట తీసుకెళ్లాడు. కొత్త ఇంట్లో కాపురం పెట్టినా నిత్యం భార్యను హింసించడం మానలేదు. భర్త వేధింపులు తాళలేక తనను తీసుకెళ్లాలని ఆమె శనివారం రాత్రి తండ్రి హుసేన్దేశాయ్కి ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చే లోపే ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారిని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి బంధువులు ఆగ్రహంతో భర్త, అత్తపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భర్త, అత్త షమీమ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు.
మృతిపై అనుమానాలు: మోహరూన్ బేగం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి ఆమె భర్త మోఫీన్ బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో నుంచి చిన్నారి ఏకధాటిగా ఏడుస్తుండటంతో పక్కింట్లోని ఓ మహిళ వెళ్లి చూసింది.
మోహరూన్ బేగం చీరకు వేళాడుతూ కనిపించడంతో చుట్టూ పక్కల వారికి విషయం చెప్పింది. 15 నిమిషాల తర్వాత తల్లి, కుటుంబీకులతో అక్కడికి చేరుకున్న భర్త ఇంట్లోకి వెళ్లి వేళాడుతున్న భార్య మృతదేహాన్ని కిందకు దించాడు. అయితే ఆమె ఉరి వేసుకున్న ప్రాంతంలో మంచం ఉందని, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినా వీలు కాదని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే బిడ్డ ప్రాణాలు తీశారని బోరున విలపిస్తున్నారు.