ఊరెళ్లొచ్చేసరికి బెడ్రూమ్లో శవం!
హైదరాబాద్ : ఊరెళ్లొచ్చే ఇంటికి వచ్చిన వారికి అనుకోని షాక్ తగిలింది. ఇంట్లో గుర్తు తెలియని శవం ప్రత్యక్షం కావటంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తారు. చాదర్‌ఘాట్ ఎస్ఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం ఆజంపురాకు చెందిన మహ్మద్ ఖాలేద్ వ్యాపారి. మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరుకెళ్లారు. బుధవారం రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులకొట్టి తలుపు తీసి ఉంది. దాంతో దొంగతనం జరిగి ఉంటుందని భావించిన వారు బెడ్రూమ్ వద్దకు వెళ్లి తలుపు నెట్టగా తెరుచుకోలేదు.
దీంతో కిటికీ అద్దం పగులగొట్టి చూడగా ఓ వ్యక్తి వైర్‌తో సీలింగ్ ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఈ దృశ్యం చూసి భయాందోళనకు గురైన ఖాలేద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆత్మహత్య చేసుకున్న అతను ఎవరు? తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.