లొంగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు!
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. అతను తన స్నేహితులతో కలసి శనివారం అర్ధరాత్రి ఓ పబ్లో వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో అతను విద్వత్ అనే వ్యక్తిని చితకబాదాడు. దీంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. బెంగళూరు యూబీ సిటీలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే కుమారుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ నలపాడ్ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎమ్మెల్యే హ్యారిస్ స్పందిస్తూ.. ‘ఇది దురదృష్టకరమైన ఘటన. బాధితుడి కుటుంబసభ్యులను పరామర్శించాను. నా కుమారుడు నలపాడ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది’అని అన్నారు. సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘నిందితుడు ఎంతటి వ్యక్తి అయినా శిక్ష అనుభవించాల్సిందే’అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నలపాడ్ పోలీసులకు లొంగిపోయాడు.