Mohanthy
-
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ
అహ్మదాబాద్: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్ బౌలర్ చేతన్ శర్మ (నార్త్ జోన్) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు. చేతన్‌తో పాటు సెలక్షన్ కమిటీలో మాజీ పేసర్లు అబయ్ కురువిల్లా, దేవాశీష్ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లు సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్‌గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్ శర్మ ఇకపై చీఫ్ సెలక్టర్ హోదాలో పని చేస్తాడు. వెస్ట్ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్ అగార్కర్ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది. వీరితో పాటు సెలక్టర్ పదవి కోసం మణీందర్ సింగ్, నయన్ మోంగియా, శివసుందర్ దాస్, రణదేబ్ బోస్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురూ బౌలర్లే (నలుగురు పేస్, ఒకరు స్పిన్నర్) కావడం విశేషం! తొలి హ్యాట్రిక్‌తో... పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో చేతన్ శర్మ భారత్ తరఫున 23 టెస్టులు (61 వికెట్లు), 65 వన్డేలు (67 వికెట్లు) ఆడాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ‘హ్యాట్రిక్’ తీసిన చేతన్...ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఏడాది ఆస్ట్రలేసియా కప్ ఫైనల్లో అతని బౌలింగ్‌లో చివరి బంతికి మియాందాద్ సిక్సర్ బాది పాక్‌ను గెలిపించిన క్షణం చేతన్‌ను సుదీర్ఘ కాలం వెంటాడటంతో అతని ఘనతలకు తగిన గుర్తింపు దక్కలేదు. దేవాశీష్ మొహంతి భారత్ తరఫున 2 టెస్టులు (4 వికెట్లు), 45 వన్డేలు (57 వికెట్లు) ఆడగా... అబయ్ కురువిల్లా 10 టెస్టులు (25 వికెట్లు), 25 వన్డేల్లో (25 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. -
విభజన అంశాల్లో సీఎస్ తీరుపై గుర్రు
గవర్నర్ సహా ఐఎఎస్‌ల అసంతృప్తి ఆప్షన్ల పేరుతో గందరగోళం సృష్టిసున్నారని అసహనం వివాదాల పరిష్కార కమిటీని తిప్పి పంపిన గవర్నర్ పోలవరం ముంపు గ్రామాల ప్రతిపాదనలకూ నో హైదరాబాద్: విభజన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అనుసరిస్తున్న తీరు పట్ల గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రతిపాదనలపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో సీఎస్ వ్యవహార శైలిపై గవర్నర్ బాహాటంగానే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన తరువాత గవర్నర్ నరసింహన్ కూడా ఆమోదం తెలిపారు. అయితే మళ్లీ బడ్జెట్ కేటాయింపులకు ఆమోదం అంటూ ఫైలు పంపడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి గవర్నర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ప్రతిపాదించారు. దీనిపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, పైగా ఆ కమిటీలో రెండు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు ఉంటారని, కనీసం ఆలోచన చేయకుండా ప్రతిపాదనలు తీసుకురావడం ఏమిటని గవర్నర్ మండిపడినట్లు సమాచారం. సీఎస్ ప్రతిపాదనలు ఆమోదించకుండా గవర్నర్ తిరస్కరించారు. పోలవరం ముంపు గ్రామాల్లో మరిన్ని గ్రామాలను చేర్చాలంటూ మరో ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. రాష్ట్ర పరిధిలోని లేని అవసరానికి మించిన అంశాల్లో కలగ చేసుకోరాదని గవర్నర్ చురకలంటించారు. ఐఏఎస్‌లకు ఆప్షన్లా?: అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలపై మహంతి వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు ఐఏఎస్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది సీనియర్లయితే తమ అసంతృప్తిని మహంతి ముందే వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసు అధికారులకు ప్రాంతం అనేది ఉండదని, అలాంటిది సీఎస్ ఆప్షన్ల పేరుతో మొత్తం మార్గదర్శకాలను గందరగోళంలోకి నెట్టేశారని ఓ ఐఎఎస్ వ్యాఖ్యానించారు. 290 మంది ఐఏఎస్‌ల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపైనే గందరగోళ పరిస్థితిని తీసుకువస్తే ఇక రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ఏ విధం గా ఉంటుందో ఆలోచించుకోవచ్చునని పలువురు ఐఏఎస్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. డెరైక్ట్ రిక్రూటీలు తెలంగాణకు తక్కువగా ఉన్నందున ఆ మేరకు తెలంగాణకు వెళ్తామన్న వారిని కేటాయిస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ నెల 16వ తేదీ కల్లా మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ సీఎస్ చర్యల వల్ల ఇప్పటి వరకు మార్గదర్శకాలు ఖరారు కాలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారుల మార్గదర్శకాల ఖరారుపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.