చేదు కాకరకాయ... చాక్లెట్లా ఉంటే..!
కాకరకాయ కూర తింటున్నప్పుడు ముక్కుకు ఏం వాసనొస్తుంది.. కాకరకాయ కూరదే వస్తుంది. ఇంకేం వస్తుంది అని అంటున్నారా.. అది కాకుండా మీకెంతో ఇష్టమైన చాక్లెట్ సువాసన వస్తే.. దొండ కాయకు వెనీలా.. చికెన్ ముక్కకు స్ట్రాబెర్రీ.. గోరుచిక్కుడుకు పల్లీ.. అవును మరీ. చిత్రంలోని అరోమా ఫోర్క్‌తో తింటే.. మీరేది తిన్నా.. మీకు నచ్చిన సువాసనే వస్తుంది.
దీన్ని కెనడాకు చెందిన మాలిక్యూల్-ఆర్ ఫ్లేవర్స్ సంస్థ తయారుచేసింది. ఈ ఫోర్క్తోపాటు 21 విభిన్న రకాల సువాసనలతో కూడిన చిన్నపాటి సీసాలు, ఆ ద్రవాన్ని పీల్చుకునే పేపర్లు వస్తాయి. ఈ ఫోర్క్ మధ్య ఉన్న రంధ్రంలో మనకు కావాల్సిన ఫ్లేవర్ తాలూకు ద్రవాన్ని వేస్తే.. అందులోని పేపర్ దాన్ని పీల్చుకుని.. మనం తిన్నప్పుడు ఆ సువాసనను వెదజల్లుతుంది. అంతేకాదు.. ఆ రోజు కూరలో అల్లం వేయడం మర్చిపోయామనుకోండి..
ఇందులోని అల్లం ఫ్లేవర్ ద్రవాన్ని ఫోర్క్ రంధ్రంలో వేస్తే.. తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చి.. కూరలో అల్లం మిస్ అయిన భావనను తొలగిస్తుందట. నాలుగు ఫోర్క్‌లు, 21 సువాసనల సీసాలతో కూడిన సెట్ ధర రూ.3,600.