క్రమబద్ధీకరణపై అనాసక్తి
► సమీపిస్తున్న గడువు.. స్పందన కరువు
► కనీస ధర చెల్లింపునకు అర్జీదారుల వెనుకడుగు
► నోటీసులు జారీచేసినా ముందుకురాని వైనం
► జీఓ 59 కిందకు చేర్చిన దరఖాస్తులే అధికం
క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందనుకున్న సర్కారు అంచనాలు తలకిందులయ్యాయి. రెగ్యులరైజేషన్‌కు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. అయినా దరఖాస్తుదారుల్లో చలనం కల్పించడం లేదు. ఉచిత రెగ్యులరైజేషన్‌కు ఆసక్తిచూపిన అర్జీదారులు కనీస ధరలు చెల్లించి వాటి యాజమాన్య హక్కులు పొందేందుకూ ముందుకు రావడంలేదు. ఉచిత కేటగిరీ కింద నమోదైన దరఖాస్తుల్లో 7,229 అర్జీలను చెల్లింపు కేటగిరీలోకి మార్చి రూ.89.98 కోట్లు సమకూర్చుకోవచ్చని జిల్లా యంత్రాంగం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.1.89 కోట్లు మాత్రమే ఖజానాకు జమయ్యాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. క్రమబద్ధీకరణ పర్వం ముగింపునకు రెండు వారాల గడువే మిగిలి ఉండడంతో నిర్దేశిత రుసం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. డిసెంబర్ 31నాటికి జీఓ 58, 59 దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే రెగ్యులరైజేషన్‌కు ఆసక్తిచూపిన అర్జీదారులు.. కనీస ధరలు చెల్లించి వాటి యాజమాన్య హక్కులు పొందేందుకు ముందుకు రావడంలేదు. మరిముఖ్యంగా ఉచిత కేటగిరీ (జీఓ 58) కింద నమోదైన దరఖాస్తుల్లో 7,229 అర్జీలను చెల్లింపు కేటగిరీ(జీఓ 59)లోకి మార్చారు. తద్వారా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించమని నోటీసులు ఇచ్చారు. వీటిని చెల్లింపు కేటగిరీలోకి మార్చడం ద్వారా రూ.89.98 కోట్లు సమకూరుతాయని జిల్లా యంత్రాంగం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.1.89 కోట్లు మాత్రమే ఖజానాకు జమయ్యాయి.
ఉచిత కేటగిరీలో వీరు దరఖాస్తుచేసుకున్నా.. నిర్మాణశైలి, జీవన స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. వీరిని జీఓ 59 కింద పరిగణించారు. దీంతో అప్పటివరకు ఉచితంగా ఇళ్ల పట్టాలు లభిస్తాయని ఆశించిన వీరందరూ ప్రస్తుతం డబ్బులు చెల్లించాల్సిరావడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
చెల్లింపు కేటగిరీది అదే పరిస్థితి
సర్కారీ స్థలాల్లోని నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో చాలా మంది రెగ్యులరైజేషన్‌కు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జీఓ 59 కింద జిల్లావ్యాప్తంగా 11,855 దర ఖాస్తులు వచ్చాయి. వీటిని గత ఆర్నెలలుగా జల్లెడపట్టిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిలో 5,230 అర్జీల ను అర్హమైనవిగా తేల్చింది. మిగతావాటిలో 2,678 దరఖాస్తులను ఆర్డీఓ నేతృత్వంలోని పరిశీలనకమిటీ తోసిపుచ్చింది.
మరోవైపు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన వాటిలో 4,703 దరఖాస్తుదారులకు నోటీసులు పంపింది. నిర్దిష్ట రుసుము చెల్లించి యాజమాన్య హక్కులు పొందాలని అందులో పేర్కొంది. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించే స్థలాలతో రూ.120.62 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు అందులో రూ.88.12 కోట్లు ఖజానాకు చేరాయి.
రిజిస్ట్రేషన్లపై అస్పష్టత!
డబ్బులు చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఆక్రమణదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై స్పష్టతనివ్వకపోవడమే. మొత్తం చెల్లించిన తర్వాత.. ఎవరైనా కోర్టుకెక్కితే తమ పరిస్థితేంటనే అయోమయం నెలకొంది. దీనికితోడు ఇతర జిల్లాల్లో జీఓ 59 కింద ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గడువు సమీపిస్తున్నా అర్జీదారులు ముందుకు రాలేకపోతున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీ కిందకు మార్పిడి జరిగిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కేవలం సరూర్‌నగర్ మండలం మన్సురాబాద్లోనే సుమారు 150 మంది పేదలు జీఓ 59 కింద తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అర్హత పొందారు. వీరంతా పూర్తి వాయిదా చెల్లించి పట్టాలు పొందాలని అనుకుంటున్నా జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డైలమాలో పడ్డారు.