టైటాన్ అధ్యయనానికి నాసా జలాంతర్గామి!
వాషింగ్టన్: శనిగ్రహ ఉపగ్రహం టైటాన్ పైకి జలాంతర్గామిని పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి సముద్రం లోతు, జీవ జాడలను అన్వేషించేందుకు ఈ ప్రయోగం చేపడుతుంది. సముద్రంలోని రసాయన అనుఘటకాలు, ప్రవాహాలు, అలలు, సముద్ర ఉపరితల నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసే పరికరాలను జలాంతర్గామి మోసుకెళ్తుందని పరిశోధకులు అంటున్నారు. దాని పైభాగాన ఉన్న స్తంభం అది భూమికి సమాచారం పంపేలా ఉపకరిస్తుంది. నీటిలో మునిగితే సంకేతాలు పంపే అవకాశం లేనందున దాని అన్వేషణ జీవితకాలం స్వతంత్రంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
టైటాన్ పరిశోధనకు శాస్త్రవేత్తలు ప్రధానంగా రెండు కారణాలను పేర్కొంటున్నారు. ఒకటి, అక్కడ హైడ్రోకార్బన్ ఆధారిత జీవజాలం ఉండే అవకాశాలు ఉన్నాయో కనుగొనడం. రెండు, మేఘాలు, వాతావరణంతో కూడిన ఏకైక ఉపగ్రహమైన టైటాన్... తీవ్ర చలి, ద్రవ మీథేన్ సముద్రాలతో పాటు భూమితో ఇతర సారూప్యతలను కలిగి ఉంది. మీథేన్ సముద్రం ద్వారా జీవ పరిణామం ఎలా జరిగింది, వీలైతే గ్రహాంతర సూక్ష్మ జీవుల ఆవిర్భావం గురించి తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.