morampudi junction
-
రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసం
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడుతున్నారు. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా ఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలా ఫలకాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మందితో పోరాడి ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టామని.. అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు.‘‘రాజమండ్రి ప్రశాంతమైన నగరం. ప్లైఓవర్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు శిలాఫలకంపై నా పేరు మాత్రమే కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పేర్లు కూడా ఉన్నాయి. శిలాఫలం ధ్వంసం చేసినా ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరు. అలజడి సృష్టించటం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కోసం పాటుపడాలి’’ మార్గాని భరత్ హితవు పలికారు. -
పర్మిట్ లేదు... అనుభవం లేదు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో బీభత్సం సృష్టించిన స్కూల్ బస్సుకు పర్మిట్ లేదని ఆర్టీఏ అధికారులు మంగళవారం రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలలే అనుభవం ఉందని తెలిపారు. దీంతో డ్రైవర్‌కు స్కూల్ బస్సు నడిపేందుకు అర్హత లేదన్నారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లోని 16వ నంబరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేమగిరి వైపు వెళ్తున్న ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.