మేగీ నూడుల్స్‌కు మరిన్ని కష్టాలు
చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే మేగీ నూడుల్స్‌కు కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మేగీని తయారుచేసే నెస్లె కంపెనీపై కఠిన చర్యలకు దిగేలా కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల ప్యాకెట్లతో కూడిన బ్యాచ్‌ని మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని ఆదేశించిన ఎఫ్డిఏ.. ఇప్పుడు మరిన్ని బ్యాచ్‌లను కూడా పరీక్షిస్తోంది. వాటిలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో సీసం, ఆహారంలో ఉపయోగించే రంగులు ఉన్నాయని ఎఫ్‌డీఏ తేల్చింది. రుచిని పెంచేందుకు మోనో సోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) అనే రసాయనం చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు ఎఫ్‌డీఏ కనుగొంది. దాంతోపాటు సీసం కూడా ఎక్కువగానే ఉన్నట్లు తేల్చింది.
దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన మరో మూడు నాలుగు బ్యాచ్‌లను కూడా యూపీ ఎఫ్‌డీఏ పరీక్షిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ నివేదికలో కూడా తేడా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని బారాబంకి జిల్లా ఆహార అధికారి వీకే పాండే తెలిపారు. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం కేవలం 2.5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) మాత్రమే ఉండాలని నిబంధనలుండగా.. మేగీలో ఏకంగా 17.2 పీపీఎం ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ నివేదికలను నెస్లే సంస్థ కొట్టిపారేస్తోంది. తాము ఓ స్వతంత్ర సంస్థతో మళ్లీ పరీక్షలు చేయిస్తున్నామని.. దాని ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కూడా అధికారులకు సమర్పిస్తామని చెబుతోంది.