వెయ్యిమంది ఉద్యోగులపై వేటు
ఫిన్ లాండ్ : 'నీకు నాకు నోకియా' అన్నట్టుగా ఒకప్పుడు టాప్ లెవల్లో దూసుకుపోయిన నోకియా బ్రాండ్ ఫోన్లకు క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది. స్మార్ట్ఫోన్ హవా పెరిగిపోవడంతో పోటీని తట్టుకోలేక నోకియా చతికిలబడింది. ఈ నేపథ్యంలో తన సొంత గడ్డ పైనే ఉద్యోగుల్లో భారీ కోత పెడుతోంది. భారీ నష్టాల కారణంగా సంస్థ ఆదాయం కుదేలవ్వడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్ పేరుతో గత దశాబ్ద కాలంగా ఉద్యోగుల సంఖ్యకు కోతవేస్తూ వచ్చిన నోకియా తాజాగా ఫిన్లాండ్లో 1,032 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు భవిష్యత్తులోనూ మరిన్ని ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
నోకియా ఇటీవలే అల్కాటెల్ ల్యూసెంట్ అనే కంపెనీని విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బిలియన్ డాలర్ ఆదాయాన్ని మిగిల్చుకునే వ్యూహంలో భాగంగా ఈ చర్యకు దిగింది. అయితే ఎంతమందిని తీసేస్తుందన్న విషయంపై కచ్చితమైన వివరాలు ఇచ్చేందుకు సంస్థ నిరాకరించింది. ఆయా దేశాల్లో తమ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. దాదాపు 30 దేశాల ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్టు వెల్లడించింది.
కాగా ప్రపంచ వ్యాప్తంగా నోకియాకు సుమారు ఒక లక్షా నాలుగువేల మంది ఉద్యోగులు ఉండగా, ఫిన్ లాండ్ లో 6,850, జర్మనీలో 4800, ఫాన్స్ లో 4,200 మంది ఉన్నారు. మరోవైపు నోకియా ఫోన్లు మళ్లీ మార్కెట్లో హల్ చల్ చేయనున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఉద్యోగులపై వేటు వేయడం సంచలనంగా మారింది.