ఇక్కడి వాళ్లు విదేశాల్లో చనిపోయారా? డెడ్ బాడీ తేవడానికి ఒక పోర్టల్
విదేశాల్లో భారతీయ పౌరులు మరణించినప్పుడు, వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. దీని కోసం అన్ని ఎయిర్‌లైన్స్ ఏజెన్సీలు ‘ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించాయి. ఫలితంగా విదేశాలలో మరణించిన వ్యక్తి సంబంధీకులు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును ఆమోదించి, విదేశాల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో చేపట్టనున్నారు.
సుదీర్ఘ ప్రక్రియ.. ఇకపై సులభతరం!
ఇన్నాళ్లూ భారతీయ పౌరులెవరైనా విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వచ్చేది. ఒక్కోసారి వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టేది. అసాధారణ పరిస్థితుల్లో ఎవరైనా మృతి చెందిన సందర్బంలో వారి మృతదేహాలను తీసుకువచ్చేందుకు మరింత సమయం పట్టేది. ఇటువంటప్పుడు కొన్నిసార్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి అవసరం కూడా ఏర్పడేది. ఈ నేపధ్యంలోనే విదేశాల నుంచి భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చే ప్రక్రియను సడలించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా సానుకూల చర్యలు మొదలయ్యాయి.
‘ఓపెన్ ఈ- కేర్’ అంటే ఏమిటి?
ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫారమ్‌ను అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు కలిసి సిద్ధం చేశాయి. ఇక నుంచి విదేశాల్లో ఎవరైనా భారతీయ పౌరులు మరణిస్తే మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మరణించిన వ్యక్తి కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును సంబంధిత అధికారులు తనిఖీ చేసిన తర్వాత, మృతదేహాలను తీసుకువచ్చే ప్రక్రియను వీలైనంత త్వరగా జరుగుతుంది.
48 గంటల్లోగా ఆమోదం
విదేశాల్లో ఉన్న భారతీయుల మృత దేహాలను తిరిగి తీసుకురావడంలో జాప్యాన్ని నివారించేందుకు ఈ- పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ- పోర్టల్ ద్వారా సెంట్రల్ ఇంటర్నేషనల్ హెల్త్ డివిజన్, నోడల్ అధికారులు, రవాణాదారులు, విమానయాన సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్‌ల ద్వారా సమాచారం పొందుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కోసం నియమితులైన నోడల్ అధికారి దరఖాస్తును తనిఖీ చేసి, 48 గంటల్లోగా ఆమోదం తెలియజేస్తారు. రిజిస్టర్డ్ నంబర్ ద్వారా అప్లికేషన్ స్థితిని ఈ-కేర్ పోర్టల్‌లో సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్