పట్టణాలకు ఊరట పల్లెలకు తప్పని కోత
మోర్తాడ్, న్యూస్‌లైన్: రబీ సీజన్ వరి కోతలు మొదలు కావడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గింది. అయినా పల్లెలకు విద్యుత్ కోతల నుంచి విముక్తి తప్పడం లేదు. ఇందుకు ప్రత్యేక ఫీడర్లు లేకపోవడమే కారణం. కాగా నాలుగు రోజుల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, సబ్స్టేషన్లు ఉన్న గ్రామాలలో గృహావసరాలకు పగటి పూట ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. గతంలో పట్టణాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాలలో ఆరు గంటలు, సబ్‌స్టేషన్ కేంద్రాలలో ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేశారు. ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసేవారు. అంతేకాక అర్ధరాత్రి మరో రెండు గంటల పాటు విద్యుత్ కోతను విధించేవారు.
విద్యుత్ కోతల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో పగటి పూట విద్యుత్ కోతల వల్ల వ్యాపారాలు సాగక అవస్థలు పడ్డారు. వర్షా కాలంలో భారీ వర్షాలు కురియడంతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. దీంతో బోరు బావుల కింద వరి సాగు విస్తీర్ణం రైతులు పెంచారు. వరి పంటకు సాగు నీరు రోజు అందించాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం పెరిగింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరగడం వల్ల గృహావసరాలకు కోతలు తప్పలేదు. ప్రస్తుతం పట్టణాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో కోతలను అధికారులు ఎత్తివేయడంతో ప్రజలకు ఊరట లభించింది.
అయితే ప్రత్యేక ఫీడర్లు లేని గ్రామాలలో మాత్రం కోతలను అధికారులు ఇంకా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు గాను 250 గ్రామాలలో సబ్స్టేషన్లు ఉన్నాయి. 468 గ్రామాలకు ప్రత్యేక ఫీడర్లను సబ్స్టేషన్ల నుంచి ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధుల కేటాయింపు జరగలేదు. ఫలితంగా ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతోంది.
ప్రత్యేక ఫీడరులు లేని కారణంగా కోతలు తప్పడం లేదు. అయితే రోజుకు 12 గంటలకు బదులు తాజాగా 9 గంటల పాటు కోతలు విధించాలని అధికారులు నిర్ణయించారు. ఈ లెక్కన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వేసవి కారణంగా ఉక్కపోత అధికంగా ఉండటంతో పల్లెలకు కూడా నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.