వైవీయూ ఎన్ఎస్ఎస్ ర్యాలీ
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం, దోమలపై దండయాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యతను తెలియజేశారు. అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ దోమలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్న దోమే కదా నిర్లక్ష్యం చేస్తే వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని అవగాహన కల్పించారు. స్థానిక తహశీల్దార్ రామాంజినేయులు, ఎంపీడీఓ మల్‌రెడ్డిలు కార్యక్రమానికి విచ్చేసి వైవీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్లు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని.. ప్రజలు ఉదాసీనత విడనాడి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామంలో సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సుజాత, వైద్యాధికారి లక్ష్మీకర్, గుండాల్రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో..
నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎన్ఎస్ దినోత్సవం, దోమలపై దండయాత్ర కార్యక్రమాలను నిర్వహించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీని ప్రిన్సిపాల్ డా. పి. సుబ్బలక్షుమ్మ ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ఏడురోడ్ల కూడలికి చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగాం ఆఫీసర్ గంగిరెడ్డి విజయలక్ష్మి, ఎకోక్లబ్ మెంబర్ యుగవాణి, రిబ్బన్‌క్లబ్ కన్వీనర్ సుబ్బారెడ్డి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు.