తెరపైకి కౌన్సిలర్ల అధిక సంతానం కేసు
కామారెడ్డిటౌన్ : కౌన్సిలర్ల అధిక సంతానం కేసు మరోమారు తెరపైకి వచ్చింది. కామారెడ్డి మున్సిపాలిటీలో ముగ్గురు కౌన్సిలర్లు అధిక సంతానం కలిగి ఉండి, నిబంధనలకు విరుద్ధంగా ధ్రువపత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారని, ఎన్నికల్లో వారి ప్రత్యర్థులు గత రెండు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. వారు చూపించిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు తప్పుడు అఫిడవిట్లతో పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్లకు సంబంధించిన వివరాల పూర్తి నివేదికను ప్రభుత్వం ముందుంచాలని కోర్టు ఆదేశించింది.
కౌన్సిల్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని, రెండు నెలల కాలంలో కౌన్సిల్ నుంచి నివేదిక పంపని పక్షంలో ప్రభుత్వ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి నివేదికను అందజేయాలని కోర్టు ఆదేశించినట్టు కక్షిదారుల తరపు న్యాయవాది కే.వేణుమాధవ్ తెలిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 1, 2, 8 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జమీల్, కాళ్ల గణేశ్, తేజాపు యాద మ్మలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. అయితే గెలుపొందిన వారు అధిక సంతానం కలిగి ఉండి చట్ట విరుద్ధంగా అఫిడవిట్లు సమర్పించి పోటీ చేసి గెలుపొందారని వారి ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల చివరి వారంలో జరుగనున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నివేదికను కౌన్సిల్ ముందుంచడానికి కమిషనర్ సిద్ధమయ్యారు. కౌన్సిల్ తీర్మానం అనంతరం అభ్యర్థులు ఎన్నికల్లో అందజేసిన అఫిడవిట్లను, ధ్రువపత్రాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషనర్ బాలాజీనాయక్ ‘సాక్షి’ కి తెలిపారు.
రహస్య చర్చలు!
కాంగ్రెస్ కౌన్సిలర్ల గెలుపు చెల్లదని కోర్టు నుంచి తీర్పు వస్తే రెండో మెజార్టీ కలిగిన అభ్యర్థులే కౌన్సిలర్లుగా అర్హులవుతారని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈవిషయైమై కాంగ్రెస్ కౌన్సిలర్లు, ప్రత్యర్థులు నిత్యం మున్సిపల్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. కమిషనర్‌తో కౌన్సిలర్లు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ తతంగం కామారెడ్డి మున్సిపాలిటీలో చర్చగా మారింది. కాగా కామారెడ్డి మున్సిపాలిటీల్లో మున్సిపల్యాక్ట్ 1995 ప్రకారం ముగ్గురు కౌన్సిలర్లు అధిక సంతానం కలిగి ఉన్నారని సాక్ష్యధారాలతో హైకోర్టులో సమర్పించామని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. ఎన్నికల నామినేషన్లో తప్పుడు అఫిడవిట్లను సమర్పించి పోటీ చేశారని ఈవిషయమై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కమిషనర్ నిర్లక్ష్యం చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడినట్టు పేర్కొన్నారు.