most powerful women list
-
Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా... ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు. అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం... ‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది... ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్. -
మరోసారి ఫీట్ రిపీట్ చేసిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తన ఫీట్‌ను రిపీట్ చేశారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక గ్లోబల్ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మల మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నారు. ఈమెతోపాటు ఆరుగురు భారతీయ మహిళలుకూడా ఉన్నారు. (సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!) 2022 ఫోర్బ్స్ లిస్టులో సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో మంత్రి జాబితాలో 37వ స్థానంలో 2020లో 41వ స్థానంలోనూ, 2019లో 34వ స్థానంలోనూ ఉన్నారు. ఇంకా హెచ్‌సిఎల్‌టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 53 ర్యాంకు సాధించారు. సెబీ తొలి చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ 54, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్ 67ను స్థానంలో నిలిచారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ ప్లేస్‌ను, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ ప్లేస్‌లోనూ నిలిచారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) కాగా ఫోర్బ్స్ టాప్-100 మోస్ట్ పవర్ ఫుల్ మహిళల జాబితాలో యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ టాప్ ప్లేస్ కొట్టేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హ్యారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. 100వ ర్యాంక్‌లో, ఇరాన్‌కు చెందిన జినా "మహ్సా" అమిని మరణానంతరం ప్రభావవంతమైన జాబితాలో చేరారు. సెప్టెంబరులో ఆమె మరణం ఇస్లామిక్ దేశంలో హక్కుల కోసం అపూర్వమైన మహిళల నేతృత్వంలోని విప్లవానికి దారితీసింది. జాబితాలో 39 మంది సీఈవోలు, 10 దేశాధినేతలు,11 బిలియనీర్లు ఉన్నారని వీరిసంపద సంయుక్తంగా 115 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ ప్రకటించింది. -
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు..భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే, ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ప్రైవేట్ రంగంలోనే చాలా వేగంగా వృద్ధి చెందుతోన్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో నిలిచారు. కాగా, అరుంధతీ భట్టాచార్య మొండి బకాయిల సమస్యకు పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియలో ఈమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. విలీనం అనంతరం ఎస్బీఐ ఆసియాలో ఒక అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడింది. రఘురామ్ రాజన్ పదవీ విరమణ తర్వాత భట్టాచార్య ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, బ్యాంకు డిజిటలైజేషన్‌కు విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వృద్ధిలో శిఖా శర్మ పాత్ర అనిర్వచనీయమని ఫార్చ్యూన్ తెలిపింది.