ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళలు..భట్టాచార్య, కొచర్, శిఖా శర్మ
న్యూయార్క్: ఫార్చ్యూన్ తాజాగా రూపొం దించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే, ప్రైవేట్ రంగ దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ప్రైవేట్ రంగంలోనే చాలా వేగంగా వృద్ధి చెందుతోన్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో నిలిచారు.
కాగా, అరుంధతీ భట్టాచార్య మొండి బకాయిల సమస్యకు పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియలో ఈమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. విలీనం అనంతరం ఎస్‌బీఐ ఆసియాలో ఒక అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది. భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడింది. రఘురామ్ రాజన్ పదవీ విరమణ తర్వాత భట్టాచార్య ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడుతుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చందా కొచర్ ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, బ్యాంకు డిజిటలైజేషన్‌కు విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ వృద్ధిలో శిఖా శర్మ పాత్ర అనిర్వచనీయమని ఫార్చ్యూన్ తెలిపింది.