భర్తని 'గున్న ఏనుగు' అని తిట్టినందుకు..
న్యూఢిల్లీ: లావుగా ఉన్న భర్తని భార్య గున్న ఏనుగు అని తిట్టడం కూడా తప్పే. ఈ కారణంతో కూడా భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చు. ఇలా తిట్టడం వైవాహిక బంధాన్ని దెబ్బతీస్తుందని, కాబట్టి ఈ కారణంతో విడాకులు తీసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
లావుగా ఉండటం, భార్య లైంగిక వాంఛలను సంతృప్తిపరచకపోవడం వల్ల ఆమె తనను క్రూరంగా హింసిస్తోందంటూ ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతనికి 2012లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో విడాకులు ఇవ్వడం సబబేనని ఉన్నత న్యాయస్థానం ఫ్యామిలీ కోర్టును సమర్థించింది.
'ఏనుగు, గున్న ఏనుగు, మోటా ఎలిఫెంట్ అన్న తిట్లు, దూషణలతో వాది తన భర్త ఆత్మగౌరవాన్ని, ఉత్సాహాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది' అని ఈ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘీ వ్యాఖ్యానించారు. స్పష్టత, నిర్దిష్టత లేని ఆరోపణలను ఆధారంగా చేసుకొని దిగువ కోర్టు విడాకుల ఉత్తర్వులు మంజూరు చేసిందని, తన భర్త పట్ల ఎప్పుడూ తాను క్రూరంగా ప్రవర్తించినో తేదీలు కానీ, ప్రత్యేకమైన సందర్భాలుకానీ ఆయన కోర్టుకు వివరించలేదని, కాబట్టి ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆమె హైకోర్టును కోరింది. అయితే ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. వైవాహిక బంధంలో ఉన్న రెండు పార్టీలు ఏ రోజు ఏ నేరం జరిగింది. ఏ తప్పిదం జరిగింది అంటూ చిట్టాపద్దును ప్రత్యేకంగా రాయరని హైకోర్టు పేర్కొంది.