Mother and baby
-
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్.. వైరల్
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్ మదర్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది. మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్లుకాస్లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్వుడ్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు) ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్వుడ్ తన ఫేస్బుక్లో ఈ వివరాలను పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ మియామీలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. (మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్) -
మాతాశిశువుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
లోదొడ్డి(రాజవొమ్మంగి) : లోతట్టు గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను అరికట్టి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ గిరిజనులకు హామీ ఇచ్చారు. బుధవారం మాతాశిశు సంక్షేమం కోసం మండంలోని జడ్డంగి, లోదొడ్డి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె ప్రారంభించారు. లోదొడ్డి పరిసర ప్రాంతాల్లో గర్భిణులు ఆస్పత్రులకు చేరేలోగా చనిపోతున్నారని తెలియడంతో ఆమె చలించిపోయారు. లోదొడ్డి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. సుమారు గంటన్నరపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్‌కు సమస్యల ఏకరువు దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తమ గ్రామానికి జిల్లాకలెక్టర్ రావడంతో స్థానికులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం వారు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. మంచం పట్టిన రోగిని దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించేందుకు అవస్థలు పడతున్నామని, తీరా రోగి పరిస్థితి విషమిస్తే మృతదేహం తిరిగి ఇంటికి తెచ్చుకొనేందుకు కష్టాలు పడుతున్నామని గిరిజనులు కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ లోదొడ్డి గ్రామానికి రవాణా అవసరాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేయాలని రంపచోడవరం పీఓ గంధం చంద్రుడిని కోరారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఐదు నెలలో పూర్తి స్థాయి బీటీరోడ్ రూపొందించాలని సూచించారు. వాతంగి సబ్‌సెంటర్, గర్భిణుల వసతి గృహం ఏర్పాటుకు రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గర్భిణుల కోసం జడ్డంగి పీహెచ్సీలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ పద్మావతిని ఆదేశించారు. ప్రతి గిరిజన మహిళను పలుకరించి వారి సమస్యలను అడిగితెలుసుకొన్నారు.లోదొడ్డి వైద్య శిబిరానికి హాజరైన వాతంగి గ్రామానికి చెందిన గర్భిణి మంప రాఘవ హైరిస్క్ (రక్తహీనతతో బాధపడుతూ) కాన్పు కష్టం కావచ్చని జిల్లా కలెక్టర్ గమనించారు. ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా కాకినాడ వచ్చే రోగుల కోసం ప్రత్యేక బర్త్ వెయిటింగ్ రూం ను వెంటనే ఏర్పాటుచేయాలని రంపచోడవరం ఏడీఎంహెచ్ఓ పవన్ కుమార్ ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జడ్డంగి, లోదొడ్డి, వాతంగి సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, లోతా రామారావు, జుర్రా జాన్, వైఎస్సార్ సీపీ నేతలు గవాస్కర్, అర్జున్, తిమోతి, ఎంపీపీ కలింకోట నూకరత్నం, వైస్ ఎంపీపీ దంతులూరి శివరామచంద్ర రాజు, వ్యవసాయపరపతి సంఘం అధ్యక్షుడు గణజాల తాతారావు, ఆర్డీఓ శంకర వర ప్రసాద్, సీడీపీఓ రాజ్యలక్ష్మి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఈఈ పీకే. నాగేశ్వరరావు, డీఈ హరికృష్ణ, ఏలేశ్వరం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ మహేశ్వరరావు హాజరయ్యారు.