మాతాశిశువుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
లోదొడ్డి(రాజవొమ్మంగి) : లోతట్టు గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను అరికట్టి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ గిరిజనులకు హామీ ఇచ్చారు. బుధవారం మాతాశిశు సంక్షేమం కోసం మండంలోని జడ్డంగి, లోదొడ్డి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె ప్రారంభించారు. లోదొడ్డి పరిసర ప్రాంతాల్లో గర్భిణులు ఆస్పత్రులకు చేరేలోగా చనిపోతున్నారని తెలియడంతో ఆమె చలించిపోయారు. లోదొడ్డి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. సుమారు గంటన్నరపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు.
కలెక్టర్‌కు సమస్యల ఏకరువు
దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తమ గ్రామానికి జిల్లాకలెక్టర్ రావడంతో స్థానికులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం వారు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. మంచం పట్టిన రోగిని దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించేందుకు అవస్థలు పడతున్నామని, తీరా రోగి పరిస్థితి విషమిస్తే మృతదేహం తిరిగి ఇంటికి తెచ్చుకొనేందుకు కష్టాలు పడుతున్నామని గిరిజనులు కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ లోదొడ్డి గ్రామానికి రవాణా అవసరాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేయాలని రంపచోడవరం పీఓ గంధం చంద్రుడిని కోరారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఐదు నెలలో పూర్తి స్థాయి బీటీరోడ్ రూపొందించాలని సూచించారు.
వాతంగి సబ్‌సెంటర్, గర్భిణుల వసతి గృహం ఏర్పాటుకు రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గర్భిణుల కోసం జడ్డంగి పీహెచ్‌సీలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ పద్మావతిని ఆదేశించారు. ప్రతి గిరిజన మహిళను పలుకరించి వారి సమస్యలను అడిగితెలుసుకొన్నారు.లోదొడ్డి వైద్య శిబిరానికి హాజరైన వాతంగి గ్రామానికి చెందిన గర్భిణి మంప రాఘవ హైరిస్క్ (రక్తహీనతతో బాధపడుతూ) కాన్పు కష్టం కావచ్చని జిల్లా కలెక్టర్ గమనించారు. ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా కాకినాడ వచ్చే రోగుల కోసం ప్రత్యేక బర్త్ వెయిటింగ్ రూం ను వెంటనే ఏర్పాటుచేయాలని రంపచోడవరం ఏడీఎంహెచ్‌ఓ పవన్ కుమార్ ను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జడ్డంగి, లోదొడ్డి, వాతంగి సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, లోతా రామారావు, జుర్రా జాన్, వైఎస్సార్ సీపీ నేతలు గవాస్కర్, అర్జున్, తిమోతి, ఎంపీపీ కలింకోట నూకరత్నం, వైస్ ఎంపీపీ దంతులూరి శివరామచంద్ర రాజు, వ్యవసాయపరపతి సంఘం అధ్యక్షుడు గణజాల తాతారావు, ఆర్‌డీఓ శంకర వర ప్రసాద్, సీడీపీఓ రాజ్యలక్ష్మి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఈఈ పీకే. నాగేశ్వరరావు, డీఈ హరికృష్ణ, ఏలేశ్వరం క్లస్టర్ ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ మహేశ్వరరావు హాజరయ్యారు.